
పర్యావరణపరంగా పలు రాష్ట్రాలకు రక్షణ కవచంగా ఉన్న ఆరావళి పర్వతాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త నిర్వచనం జాతీయస్థాయిలో దుమారం రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. గత నెల తాను ఇచ్చిన ఆదేశాలను సోమవారం నిలిపివేసింది. ‘‘కోర్టు ఆదేశాలు, కమిటీ సిఫార్సులు నిలిపివేయడం అవసరమని మేం భావిస్తున్నాం. కొత్త కమిటీ ఏర్పాటయ్యేవరకు ఈ స్టే అమల్లో ఉంటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. కొత్త నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
దేశంలోనే అతిపురాతన పర్వతశ్రేణి ఆరావళి. ఇక్కడ అక్రమంగా పొందిన అనుమతులతో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని ఎప్పటినుంచో ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో 100 మీటర్లు… అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలంటూ కేంద్రం కొత్త నిర్వచనం చెప్పింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌కు అనుమతించింది. దీనివల్ల హరియాణా, రాజస్థాన్, గుజరాత్, దిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరావళి పర్వత శ్రేణులు ఉన్న రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులేవీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. గుజరాత్ నుంచి జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) వరకూ విస్తరించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణుల సమగ్రతను పరిరక్షించేందుకు, గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.





