
తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు తనిఖీలు నిర్వహించారు. లడ్డూ నాణ్యత, భక్తులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై భక్తుల నుంచి స్వయంగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు. అనంతరం లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టిటిడి రోజుకు 4 లక్షల లడ్డూలు, 8 వేల కల్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా లడ్డూల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.





