News

మతపరమైన మైనారిటీలు,జిహాదీ ఉగ్రవాదంపై VHP కీలక తీర్మానాలు

135views

విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ ట్రస్ట్ బోర్డు సమావేశాలు ఈ నెల 17 నుంచి 19 వరకూ హస్తినాపురంలోని జంబూద్వీప్ లో జరిగాయి. ఈ సందర్భంగా రెండు అత్యంత కీలకమన తీర్మానాలను ఆమోదించారు. అందులో మొదటిది జిహాదీ సవాళ్లు, వాటి పరిష్కారాలు కాగా, రెండోది మతపరమైన మైనారిటీలు అన్న దానికి సరైన తార్కిక నిర్వచనం అవసరం.

 

ముస్లింలలోని ఓ వర్గంలో మూఢనమ్మకాలు, మతోన్మాదం నుంచి ఉత్పన్నమయ్యే జిహాదీ మనస్తత్వం కారణంగా ప్రపంచం నేడు జిహాద్ ను ఎదుర్కొంటోందని వీహెచ్ పీ తన తీర్మానంలో ప్రస్తావించింది. ఈ సందర్భంగా డిసెంబర్ 14న ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, జిహాదీ ఉగ్రవాదం ఇకపై భారత్‌కు మాత్రమే పరిమితం కాదని, అమెరికాతో సహా మొత్తం ప్రపంచానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని, అలాగే ఇది నిరంతరం పెరుగుతున్న ముప్పుగా మారిందని ఈ సంఘటన నిర్ధారిస్తుందని వివరించింది.

 

అయితే భారత్ మాత్రం ఈ సవాలును శతాబ్దాలుగా ఎదుర్కొంటోందని, జిహాదీ ఉగ్రవాదులను తరుచుగా నిరక్షరాస్యులుగా కొందరు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సంఘటనల్లో వైద్యులు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు వంటి విద్యావంతుల ప్రమేయాన్ని స్పష్టంగా బయట పడుతూనే వుందని తీర్మానంలో పేర్కొంది.ఒసామా బిన్ లాడెన్, అయ్మాన్ అల్-జవహిరి, అఫ్జల్ గురు మరియు డాక్టర్ ఉమర్-ఉన్-నబి వంటి వ్యక్తులను ఉన్నత విద్యావంతులుగా ఉదహరించింది.

 

ఉగ్రవాద కార్యకలాపాలు మరియు పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆరోపణలపై ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ముజమ్మిల్‌ను అరెస్టు చేయడం మరియు భద్రతా సంస్థలు డాక్టర్ షాహీన్ షాహిద్‌తో సహా అనేక మంది వైద్యులను అరెస్టు చేయడం వంటి ఇటీవలి కేసులను కూడా ఈ తీర్మానం ప్రస్తావించింది.ఈ పరిణామం భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ముప్పే అని తీర్మానంలో ప్రస్తావించింది. ఇస్లాం మత గ్రంథాలలో వున్న వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం వుందని కూడా తీర్మానం చేసింది. ఇస్లాంను విశ్వసించే వారిని మోమిన్ గా, నమ్మన వారిని కాఫిర్ గా పిలుస్తారని పేర్కొంది.

 

ఇక.. సెంట్రల్ ట్రస్ట్ ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నింటిపై డిమాండ్ చేసింది.

 

1. జిహాదీ మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తున్న మదర్సాలను పూర్తిగా ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకురావాలి.అలాగే అందులోని పాఠ్యాంశాలు, ఉపాధ్యాలయులపై నిరంతర పర్యవేక్షణ. అక్రమ మదర్సాలను, మసీదులను మూసివేయడం, వాటి ఆర్థిక పరిస్థితులను ఆడిట్ చేయడం, వాటికి అందే ఆర్థిక సాయాన్ని నిలిపేయాలి. మదర్సా విద్యా స్థానంలో జాతీయవాద విద్యను ప్రవేశపెట్టాలి.

 

2.ఇస్లామిక్ తీవ్రవాద సాహిత్యం అని పిలిచే దానిని నిషేధించాలి మరియు ఇస్లామిక్ సంస్థలలో జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలను దర్యాప్తు చేయాలి, దోషులుగా తేలిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి.

 

3.బంగ్లాదేశీ, రోహింగ్యా మరియు ఇతర ముస్లిం చొరబాటుదారులను దేశం నుండి బహిష్కరించాలి.

 

4.జిహాదీ ఆర్థిక నెట్‌వర్క్‌లుగా పిలిచే వాటిపై కఠినమైన నియంత్రణలు విధించాలి. హలాల్ ఆర్థిక వ్యవస్థపై చర్యలు తీసుకోవాలి.

 

5. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి.

 

అలాగే హిందూ సమాజానికి కూడా విశ్వహిందూ పరిషత్ కొన్ని సూచనలు చేసింది. హిందూ జనన రేటు తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక సంఘటనలు జరిగితే తమ పరిధిలోకి వచ్చే అధికారులకు వెంటనే నివేదించాలని కూడా సూచించారు. పిల్లల్లో హిందూ విలువలను పెంపొందించాలని, వారిని దేశభక్తులుగా మార్చాలని తీర్మానంలో పేర్కొంది.