తెలుగు రాష్ట్రాలలో హిందువులను రక్షించు మహా ప్రభో – రాష్ట్రపతికి విన్నవించిన విశ్వ హిందూ పరిషత్

తెలుగు రాష్ట్రాలలోని హిందువుల హక్కులను రక్షించి, ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను గుర్తించి హిందువులకు రక్షణ కల్పించవలసిందిగానూ, హిందువుల హక్కులను కాపాడవలసిందిగానూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ కు విన్నవించింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమోరాండం సమర్పించారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాయని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. క్రైస్తవ, మహమ్మదీయ ఓటు బ్యాంకు కోసం హిందువులకు వ్యతిరేకంగా వివక్షతో కూడిన విధానాలను అమలు చేస్తున్నారని వారు ఆరోపించారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైనవని, అనేకసార్లు న్యాయస్థానాలు కూడా తిరస్కరించినవని వారు తెలిపారు. రాజ్యాంగ విరుద్ధం అయినప్పటికీ మైనారిటీలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని కూడా వారు ఆరోపించారు.

అదేవిధంగా ప్రభుత్వ నిధులతో చర్చిలు, మసీదులు నిర్మించడం, క్రైస్తవ పాస్టర్లకు, ముల్లాలకు వేతనాలను అందించడం వంటివి కూడా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలేనని వారు స్పష్టం చేశారు. హిందువుల పండుగలు, పర్వదినాలలో అధిక బస్సు ఛార్జీలు వసూలు చేసే ప్రభుత్వాలు క్రైస్తవులు, మహమ్మదీయులకు మాత్రం ఉచిత యాత్రా సౌకర్యాలను కల్పిస్తూ ఉండడం వివక్ష కాదా? అని వారు ప్రశ్నించారు.
తిరుమల వంటి పవిత్ర పుణ్య క్షేత్రాలలో అన్యమత ప్రచారం నిర్వహించడమే గాక ఉద్దేశపూర్వకంగా ఆయా దేవాలయాలలో అన్య మతస్తులను అధికారులుగా, పాలకమండలి సభ్యులుగా నియమిస్తున్నారని, కోర్టు తీర్పులను కూడా తోసిరాజని వేల ఎకరాల దేవాలయ భూములను యథేచ్ఛగా ధారాదత్తం చేస్తున్నారని వారు వాపోయారు.
ప్రభుత్వాల తీరుతో క్రైస్తవ మిషనరీలు, ముస్లిం మౌల్వీలు రెచ్చిపోయి హిందువుల మీద తరచూ ఘర్షణలకు దిగుతున్నారని వారు తెలిపారు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను రాష్ట్రపతి తన అధికారం ద్వారా నియంత్రించి హిందువులు గౌరవప్రదంగా జీవించే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కలుగజేయాలని వారు రాష్ట్రపతిని కోరారు.
అన్ని జిల్లా కేంద్రాలలో ఊరేగింపుగా వెళ్లిన కార్యకర్తలు జిల్లా కలెక్టర్లకు మెమోరాండం అందజేశారు.





