
తరతరాలుగా వస్తున్న పురాతన ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకృతి సౌందర్యం నడుమ అద్భుత క్షేత్రంగా కొలువైన నరసింహ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కల్ప తరువుగా ఉన్నారని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. వేదాద్రి యోగా నంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జ్వాలా నరసింహ స్వామి కొండకు వెళ్లేందుకు రూ. 1.30 కోట్లతో ఏర్పాటు చేసిన ఘాట్ రోడ్డు , ఆర్చ్ లను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, వేద పండితులు వేద మంత్రో చ్చరణలు, కోలాట బృందాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామీజీకి ఎమ్మెల్యే దంపతులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇవి మన చరిత్రకు, పూర్వీకుల జీవన విధానానికి నిదర్శనాలు. పురాతన ఆలయాలను కాపాడుకోవడం మన సంస్కృతి, సంప్రదాయాలను, కళా నైపుణ్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి చాలా ముఖ్యమని చెప్పారు. ఆలయాలను గౌరవించి, పునరుద్ధరణకు కృషి చేయాలి, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీటిని రక్షించుకోవాలని సూచించారు.





