
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి ప్రత్యేకం
అమర జీవి పొట్టి శ్రీరాములు అనగానే ఎక్కువమందికి తోచేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన వ్యక్తి అని మాత్రమే. అంతకుముందు ఆయనకేమీ చరిత్ర లేదా..అంటే ఉంది. ఆత్మాహుతికి ముందు కూడా ఆయనకు మహోజ్వల జాతీయోద్యమ జీవితం ఉంది. హరిజనోద్ధరణ, హరిజనుల దేవాలయ ప్రవేశం, ఖాదీ ప్రచారం, మద్యపానాన్ని మాన్పించడం, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై పోరాటం, పతిత జనోద్దరణ, భిక్షువుల సమస్యలపై పోరాటం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, హిందూముస్లింల ఐక్యత ఇలా విభిన్న ఉద్యమాల్లో ఆయన కృషి చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులో మహాలక్ష్మమ్మ, పొట్టి గురవయ్య దంపతులకు జన్మించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన శ్రీరాములు తల్లి దగ్గరే నలుగురి సంతానంలో ఒకడిగా పెరిగారు. శ్రీరాములు జీవించిన 52 ఏళ్లలో తొలి 20 ఏళ్లు మద్రాసులోనే ఉన్నారు. శ్రీరాములు ఫిఫ్త్ ఫార్మ్ వరకు మద్రాసులో చదివారు. అది పూర్తి కాలేదు. దీంతో బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 1924లో శానిటరీ ఇంజనీరింగ్, ప్లంబింగ్‌లో డిప్లమో చేశారు. గ్రేట్ ఇండియన్ పెనిన్స్యులర్ రైల్వే అంటే ప్రస్తుత సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ ప్లంబర్‌గా ఉద్యోగం పొందారు.
శ్రీరాములు తల్లి మహాలక్ష్మమ్మ 1928లో చనిపోయింది. ఆ తర్వాత భార్య సీతమ్మ ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. కానీ, ఆ పిల్లాడు ఐదు రోజులకే చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు క్షయ రోగంతో సీతమ్మ మరణించింది. ఇలా వరుసగా తీరని విషాదాలను ఎదుర్కొన్నారు. జీవితం పై విరక్తి చెందిన శ్రీరాములు ఉద్యోగాన్ని వదిలేశారు. తన శేషజీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తూ సబర్మతి ఆశ్రమం చేరుకొని గాంధీజీ అనుసరుడిగా మారారు. తన ఆస్తిపాస్తులను అన్నదమ్ములకు పంచి పెట్టి గాంధీజీ పూరించిన స్వాతంత్ర్యోద్యమ శంఖారావానికి ప్రభావితులై జాతీయోద్యమంలోకి అడుగుపెట్టారు.
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ ఆలోచనను, ఆచరణను శ్రీపొట్టి శ్రీరాములు తన రక్తంలో జీర్ణించుకున్నారు. 1933 ఆగస్టు 1 రాత్రి గాంధీజీతో పాటు బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించిన 34 మందిలో పొట్టి శ్రీరాములు ఒకరు. ఇది ఆయనకు తొలిసారి జైలు జీవితాన్ని పరిచయం చేసింది. బిహార్ భూకంపంతో జైలు నుంచి విడుదలైన శ్రీరాములు భూకంప బాధితుల కేంద్ర సహాయక సంఘంలో చేరి సేవలు అందించారు. దాదాపు పది నెలలపాటు నిద్రా హారాలు మాని, సహాయ సేవా కార్యక్రమాలను పొట్టి శ్రీరాములు గొప్పగా నిర్వహించారు. 1937లో మేనమామ భార్య తండ్రి అయిన గోనుగుంట్ల నర్సయ్య మరణంతో శ్రీరాములు ప్రజా జీవితం తెలుగు ప్రాంతానికి తరలివచ్చింది.
సర్వోదయ నాయకులు స్వామి సీతారం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం ప్రాయోపవేశ దీక్షకు ఉపక్రమించారు. కేంద్ర నాయకుల హామీతో ఆయన దీక్ష విరమించిన తరువాత ఎంత కాలానికీ రాష్ట్ర నిర్మాణం జరగకపోవడంతో ఆంధ్రులలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. అప్పుడు శ్రీరాములు రంగ ప్రవేశం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకై 1952 అక్టోబర్ 19న మద్రాస్‌లో శ్రీ బులుసు సాంబమూర్తిగారి గృహంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాలు చేశాడు. ఎవరైనా కాంగ్రెస్ వారు ఆ వైపు వెళితే అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో కాంగ్రెస్‌వాడే అయినా శ్రీ పొట్టి శ్రీరాములు ఒంటరివాడైపోయారు. అయినా ఆయన తన దీక్షను విరమించలేదు. నిరాహారంతో ఆయన శారీరక స్థితి అదుపు తప్పడంతో ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టారు. పేగులు పుండ్లు పడి పురుగులు నోటి నుండి వచ్చేవి. కళ్లు, చెవుల నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం నోటి నుండి వచ్చేది. వర్ణించడానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్వడానికి 58 రోజులు పట్టింది. ఎంతో దారుణమైన మరణ వేదనను అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పడానికి మాటలు చాలవు.
58 రోజుల నిరాహారదీక్ష తరువాత శ్రీరాములు గారు డిసెంబర్ 15న ఆంధ్రరాష్ట్రం కోసం అసువులు బాసి అమర జీవి అయ్యారు. ఆయన బలిదానంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 2008 మే 22వ తేదీన నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వభాషా రాష్ట్రం కోసం ఆత్మార్పణకు పూనుకున్న యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. రాజాజీ వంటి కొందరు నాయకులు కొంత దూరదృష్టితో, ఉదార బుద్ధితో వ్యవహరించి ఉంటే తెలుగువారు శ్రీ పొట్టి శ్రీరాములును కోల్పోయి ఉండేవారు కాదు. నిజానికి పొట్టి శ్రీరాములు ధీరోదాత్త ఆత్మత్యాగం కారణంగా తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, గుజరాతీలు, మహారాష్ట్రీయులు.. ఇలా ఎన్నో మాతృభాషలవారు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పరచుకోగలిగారు. శ్రీపొట్టి శ్రీరాములుగారి జయంతి సందర్భంగా ఆయనకు పరిపూర్ణ నివాళులు అర్పించడం ప్రతి తెలుగువాడి కృతజ్ఞతాపూర్వక కర్తవ్యం.





