NewsProgramms

హిందూ సమాజం శక్తివంతమైతే దేశం కూడా శక్తివంతమవుతుంది – శ్రీ ఆలె శ్యాంకుమార్

823views

హిందూ సమాజం శక్తివంతమైతే దేశం సర్వ సమస్యల నుంచి విముక్తం అవుతుందని ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా మన దేశ సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న దాడులు, ధార్మిక మూలాలను బలహీనపరచే దుష్ప్రయత్నాలను ఇంక హిందూ సమాజం సహించబోదని ఆయన పేర్కొన్నారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో పీడనలకు గురవుతున్న మైనారిటీలకు భారతదేశంలో పౌరసత్వాన్ని  ఇచ్చి, వారిని సంరక్షించడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తూ ఉండడం విచారకరమన్నారు. నేడు హిందూ సమాజం శక్తివంతమైనదని, కనుకనే దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తున్నదని, జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ప్రజల ఆకాంక్షల మేరకే జరుగుతున్నాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీ వీకే చతుర్వేది మాట్లాడుతూ క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి కలిగిన వ్యక్తుల అవసరం దేశానికి ఎంతో ఉన్నదని, ఆర్ ఎస్ ఎస్ అలాంటి దేశభక్తులైన, క్రమశిక్షణ, సేవాభావం, అంకితభావం కలిగిన వ్యక్తులను నిర్మాణం చేస్తూ నవభారత నిర్మాణంలో కీలక భాగస్వామ్యం వహిస్తూ ఉన్నదని అన్నారు.

అనంతరం విజయవాడ పురవీధులలో భారతమాత, ఆర్ ఎస్ ఎస్ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్, మరో ఆర్ ఎస్ ఎస్ నేత శ్రీ గురూజీ గోళ్వాల్కర్ ల చిత్రపటాలను ఊరేగిస్తూ  నిర్వహించిన పథ సంచలన్ అందరినీ ఆకట్టుకుంది. దారిపొడవునా  ప్రజలు పూల జల్లులు కురిపిస్తూ వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ విభాగ్ సంఘచాలక్ శ్రీ నార్ల వినయ్ కుమార్, మహానగర్ కార్యవాహ శ్రీ వల్లూరు మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పథ సంచలన్ లు, శోభాయాత్రలు జరిగాయి. వాటిలో కొన్ని దృశ్యాలు మా VSK పాఠకుల కోసం….

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.