
దేశంలో హిందువుల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని శతృమూకలు ఎదురు చూస్తున్న తరుణంలో హిందూ శక్తులన్నీ ఏకం కావాలని ప్రముఖ ప్రవచన కర్త రామకృష్ణానంద అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని చిట్టివలస బంతాట మైదానంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. సనాతన ధర్మం, సత్యం, హిందూ శక్తుల ఏకీకరణలో భారతదేశం విశ్వగురుగా మార్గం చూపుతుందన్నారు. భారతదేశం సురక్షితంగా ఉండాలంటే హిందువుల సంఖ్య పెరగాలన్నారు. నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంటే కొన్ని విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని నాశనం చేసేందుకు నిరంతరం పని చేస్తున్నాయి. దీని కారణంగా తరచూ శతృమూకలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ మధుకర్ మాట్లాడుతూ పలు రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ భారతదేశం ముందంజలో ఉందన్నారు. హిందువులను సమైక్యంగా ఉంచడానికి వందేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తుందన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తి శివాజీ, స్వామి వివేకానంద, వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్ తదితర మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆనందపురం మండలం దుక్కవానిపాలెం గ్రామానికి చెందిన ఇల్లిపల్లి నరసింగరావు బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. అలాగే చిన్నారుల భరతనాట్యాన్ని ఆహుతులు ఆస్వాదించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. హిందూ సమ్మేళనంలో రంగూరి సీతారామదొర, కోరుకొండ రామలక్ష్మి, దుర్గా కిరణ్మయి, సర్పంచ్ గాడు వెంకటనారాయణ, వెంకటప్పడు, జీరు కై లాష్, సన్యాసినాయుడు, కృష్ణంరాజు, ప్రసాదరాజు, నీలాపు శంకరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కులవృత్తులను కొనసాగిస్తున్న వారిని హిందూ సమ్మేళనంలో ఘనంగా సత్కరించారు.





