News

స్వీడన్‌లో హిందీ బోధిస్తున్న హ్యాన్స్‌ వర్నర్‌

61views

‘ప్రపంచం ఓ కుగ్రామం’ అనే నానుడికి ప్రతిబింబం హ్యాన్స్‌ వర్నర్‌. జర్మనీలో పుట్టిన ఈయన పదిహేనేళ్లుగా స్వీడన్‌లో హిందీ బోధిస్తుండటం విశేషం. భోపాల్‌లో జరుగుతున్న ‘విశ్వ రంగ్‌ మహోత్సవ్‌’లో పాల్గొనేందుకు ప్రవాస రచయితగా ఆయన భారత్‌కు వచ్చారు. జర్మన్‌ – స్విస్‌ రచయిత హర్మన్‌ హెస్‌ రాసిన ‘సిద్ధార్థ’ నవలను తన తండ్రి చనిపోయాక 15 ఏళ్ల వయసులో వర్నర్‌ చదివారు. ఆ పసిమనసుపై అది బలమైన ముద్ర వేసి, భారతీయ సంస్కృతిపై ఆసక్తిని పెంచింది. ఆ ప్రయత్నంలో భాగంగానే హిందీపై ఆయన తిరుగులేని పట్టు సాధించారు. ‘‘బౌద్ధంపై శ్రద్ధ పెరిగింది. చాలా సమాచారం సేకరించాను. జర్మనీలో ఇండాలజీ (భారతీయ చరిత్ర, సంస్కృతి, భాషలు) సబ్జెక్టు నేర్చుకున్నాను. ఇదంతా 40 ఏళ్ల కిందట జరిగింది’’ అని వర్నర్‌ వివరించారు. హిందీ ధారాళంగా మాట్లాడుతూ, పర్షియన్‌ పదాలు కలగలసిన ఉర్దూ సాహిత్యాన్ని ఆయన తేలిగ్గా వల్లె వేస్తున్నారు. పశ్చిమ దేశాల్లో హిందీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరగాలంటున్న వర్నర్‌.. ‘‘స్వీడన్‌లో నాకు మంచి ఉద్యోగమే ఉన్నా, భారత ప్రజలు నన్ను కోరుకుంటే కొంతకాలం ఇక్కడ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని తెలిపారు.