ArticlesNews

గ్రామదేవతలకు మూలాధారం యోగశక్తి

73views

దేవుడొక్కడే. పురుషుడూ కాదు, స్త్రీ కూడా కాదు. దేవుడు దేవుడే. ఈ సృష్టి ప్రారంభంలో ఉన్న చైతన్యమే దేవుడు. నేనొక్కణ్ణి బహుగా విస్తరించాను అని (ఏకోనవి బహుస్యామః) వేదంలో దేవుని మాటగా ఒక వాక్యముంది. అంటే చైతన్యరూపమైన ఆ భగవంతుణే మనం పంచభూతాలుగా (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) చూస్తున్నాం. ఇది తత్త్వం తెలిసిన ఆధ్యాత్మికవేత్తలు చెప్పేమాట. సరిగ్గా సనాతన ధర్మం చెప్పే విషయం కూడా ఇదే.

కాని వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ప్రబంధాలు భారతీయ భాషలలోకి వచ్చిన తరువాత ఒక్కడైన దేవుడు ఆయా కాలాలలో శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన నిమిత్తం అవతరించాడు అని తెలిసింది. దశావతారాలు ఏకవింశత్యవతారాలు (21), కాదు 108 అవతారాలు ప్రచారంలోకి వచ్చాయి.

ప్రధానంగా పరబ్రహ్మ (ఒకే ఒక్క దేవుడు) త్రిమూర్తులుగా విభక్తమై బ్రహ్మ (సృష్టికర్త), విష్ణు (భర్త), మహేశ్వరునిగా (హర్త) ప్రజాజీవితంలోకి వచ్చాడు. ఆదిశక్తితో పాటు లక్షీ పార్వతీ సరస్వతులు ఆరాధ్యదేవతలయ్యారు. ఇవన్నీ చెబుతూనే పరమాత్మ వివిధ రూపాలే ఇవన్ని ఆధ్యాత్మిక వేత్తలు ఏకాత్మవాదాన్ని ప్రస్థాపించారు. అంతేగాక ప్రతి ఒక్కరినీ మమాత్మ సర్వభూతాత్మ అనుకోమన్నారు.
ఇటు ఆధ్యాత్మిక తత్త్వాన్ని, అటు శాస్త్ర విజ్ఞానాన్ని అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు ఈ విధంగా ఆరాధన పద్ధతులు వచ్చాయని విశ్లేషించారు.

1. ఆత్మారాధనం (Animisim)
2. భుతారాధనం (Fetisishim)
3. జంత్వారాధనం (Totomism
4.ప్రాఙ్మానవ దేవతారాధనం (Ancestral worship)
5. మాత్రారాధనం (Mother godesses worship)
6. దైవారాధనం (God worship)

ఆరాధనలో ఇదొక పరిణామక్రమం అనిపించినా ఇవన్నీ అప్పుడున్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. ఇందులోని మాత్రారాధనమే స్త్రీదేవతారాధనం. అసలు మొదటి ఆరాధన ఇదే అని వాదించేవారూ ఉన్నారు. పాశ్చాత్య చరిత్రకారులు తమ దృష్టితో ఈ దేశంలో ఉన్నత సంప్రదాయం (Great Tradition) అల్ప సంప్రదాయం (Little Tradition) ఉందని విభజించి దేశ సమైక్యతా భావానికి గండికొట్టే ప్రయత్నం చేశారు. వారి దృష్టిలో లక్ష్మి, పార్వతి, సరస్వతులను పూజించడం గ్రేట్. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మలను పూజించడం లిటిల్ అన్నమాట.

పార్వతీదేవినే ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మగా పిలుస్తారని, శ్రీశైలం మల్లికార్జున స్వామియే కొమిరెల్లి మల్లన్న అయ్యాడని భారతీయేతిహాస రచయితల అభిప్రాయం.

ఈ అధ్యయనం తక్కువైపోయి వర్గభేదాలు, వర్ణ వైషమ్యాలు, కులతత్త్వాలు, నాగరిక గ్రామీణ భేదభావాలు ప్రబలిపోయి గ్రామదేవతలను ప్రత్యేకంగా అధ్యయనం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాచీన పౌరాణిక గ్రంథాలలో (మత్స్య, మార్కండేయ, భాగవత, దేవీభాగవతం, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వాయు, విష్ణు, వామన, అగ్ని, నారద, పద్మ, లింగ, కూర్మ, స్కాంద పురాణాది పద్దెనిమిది) ఉన్న దేవతలందరూ ఒక వర్గంగా కనిపించారు. జానపద పురాణగాథలలో అభివ్యక్తమైన దేవతలు గ్రామదేవతలుగా ప్రచారంలోకి వచ్చారు. ఆ గ్రామదేవతలను పరిశోధకులు ఈ విధంగా నిర్వచించారు.

గ్రామదేవతలందరూ ప్రకృతి నుంచే జన్మించారు. గంగ నుండి గంగమ్మ, ఈదుల నుంచి ఈదమ్మ, పెద్దరికం నుండి పెద్దమ్మ, తలుపుల నుంచి తలుపులమ్మ, చంద్రం (కుంకుమ) నుండి చంద్రమ్మ, ఎల్ల లోకాల నుండి ఎల్లమ్మ, పొలిమేర నుండి పోలేరమ్మ, పైడి నుంచి పైడితల్లి, ఆది దేవతగా ఆదెవ్వ, అమ్మతల్లి పోసింది కాబట్టి పోశవ్వ (సోచే తల్లి ప్రోచమ్మ=పోచమ్మ), తిరుపతి ప్రాంతం పేరిట తిరుపతమ్మ… ఇలా చెట్టూ చేమా, రాయీ రప్ప, నేలా గాలి అన్నీ గ్రామ దేవత పుట్టుకకు కారణాలైనాయి.

ఆదిశక్తి అంశాలుగా మైసమ్మ, పోచమ్మ, బాలమ్మ, మాంకాలమ్మ, ఈరెమ్మ, పెద్దమ్మ, పిన్నమ్మ, పోలేరమ్మ, తదితర దేవతలని తెలంగాణ ప్రాంతంవారు పిలుచుకుంటున్నారు. చౌడమ్మ, తలుపులమ్మ, చంద్రమ్మ, తిరుపతమ్మ, చెంగాళమ్మ, తదితర దేవతలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నారు. కోస్తాలోని కొన్నిచోట్లా, కళింగ – విజయనగరం ప్రాంతాలలో పేరంటాళ్లనే గ్రామదేవతలుగా పిలుస్తున్నారని ఆచార్య నాయని కృష్ణకుమారి తమ పరిశోధనలో – వివరించారు.

తమను తాము సమాజం కోసం అర్పితం చేసుకొన్న స్త్రీలెందరో దేవతలయ్యారు. ఓ వృద్ధురాలు గాని, ఒక యువతి గాని, ఒక బాలిక గాని ఆ గ్రామానికి శ్రేయస్సు కలిగించే ఓ మంచి కార్యానికి తనను తాను సమర్పించుకొన్న సందర్భంలో ఆమె ఆ గ్రామం దృష్టిలో దేవత అవుతుంది. ఆమెను ఆరాధించడం అలా ప్రారంభమవుతుంది. ఏ రోజు ఆమె బలి అయిందో ఆ రోజు ప్రతి సంవత్సరం ఆమె పేరిట ఆ ఊరిలో పండుగ చేస్తారు. కొన్నిచోట్ల రెండు మూడురోజులు జాతర చేస్తారు. ఇదే మాత్రారాధన అని ప్రాక్ చారిత్రక యుగం నుంచే ఈ మాతృదేవతా కల్పనం ఉందనీ త్రవ్వకాల ద్వారా లభించిన ఆధారాలతో ఇలా నిర్ణయించదని ఆచార్య నాయని కృష్ణకుమారి అన్నారు. ఈ దృష్టి ఫలవంతం కావడానికి క్షేత్ర సదృశ అయిన స్త్రీయే ప్రధాన కారణం. సృష్టికి మాతయే ఆధారమన్న భావన జానపదులలో కలిగింది. ఆ కారణాన్నే త్యాగియై తనను తాను అర్పించుకున్న మహిళను వారు దేవరగా భావించారని పరిశోధకులు నిర్ణయించారు. ఒక ఊరుంది. ఆ ఊరిలో నల్లమ్మ ఉంది. ఆ ఊరికో చెరువు ఉంది. అది ఆ మధ్యకాలంలో మాటిమాటికి తెగిపోవడం ఆరంభమైంది. పూర్ణ గర్భవతిని బలి ఇస్తే ఆ చెరువు గండి పడకుండా ఉంటుందని గంగమ్మ కలలో కనిపించి ఆ ఊరి పెద్ద మనిషికి చెప్పింది. ఆ పెద్దమనిషి ఈ విషయం పదిమందికి చెప్పాడు. నల్లమ్మకీ సంగతి తెలిసింది. ఆమె పూర్ణ గర్భవతి. ఆ రోజు రాత్రి చెరువు గండిలో కూర్చుంది. చెరువు గండి పడింది కాని, ఆగి పోయింది. గండి పూడ్చేశారు. నల్లమ్మ ఆ విధంగా తనను తాను అర్పించుకుంది. ఆత్మాహుతి చేసుకొంది. గ్రామ హితానికి ఆ విధంగా బలి అయిన నల్లమ్మ పేరిట ఆ ఊరు నల్లచెరువు అయింది. చెరువు మీద నల్లమ్మ విగ్రహం కూడా వెలసి ఆమె గ్రామ దేవతగా పూజలందుకుంటుంది. మాలిక్ కాఫర్తో పోరాడి మరణించిన సమ్మక్క, సారలమ్మలు గిరిజన గ్రామదేవతలయ్యారు.

కామమ్మ, సన్యాసమ్మ, తిరుపతమ్మ, ముసలమ్మ, తదితర గ్రామ దేవతలని జనం కొలుస్తూనే ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి ‘ముసలమ్మ మరణం’ పేరిట ఒక ఆధునిక పద్య కావ్యాన్ని రచించారు.

ఈ గ్రామదేవతలందరికి ఎందరో అక్కచెల్లెండ్రు ఉండడం, వారికి పోతరాజు వంటి తమ్ముడు ఉండడం, ఆ సోదరుడు వీరిని రక్షిస్తూ ఉండడం సర్వసాధారణం. గ్రామ దేవతకి ఇదే ఆకారమని ఉండదు. ఒక నున్నటి రాయికి అభిషేకం చేసి బొట్టుబోనం పెడతారు. ఎక్కువగా వ్యవసాయం ఇతర వృత్తులలో ఉన్నవారు గ్రామ దేవతలను ఆరాధిస్తారు.