
పసి పిల్లలు దేవుడితో సమానం అంటారు. బాల్యావస్థ మైనపు ముద్దలాంటిది. పెద్దలు దాన్ని ఎలా మలిస్తే అలా రూపు దిద్దుకుంటుంది. సహజంగా పిల్లలు సృజనశీలురు. వారిలో దైవీగుణాలెన్నో ఉంటాయి. పెంపకం ప్రభావంతో పెద్దయ్యేకొద్దీ అవి మాయమూ కావచ్చు, లేదా మరింతగా రాణించనూ వచ్చు.
పిల్లల పెంపకానికి సంబంధించి మహాభారతంలోని ఓ విషయం అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. తండ్రికి దూరమైన పాండవులు తల్లి కుంతీదేవి సంరక్షణలో మంచివారిగా పెరిగారు. తల్లిదండ్రులు, బంధుగణం అండగా ఉన్న కౌరవులు అహంకారం, ఈర్ష్య, అసూయలతో పెద్దవాళ్లు అయ్యారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగి అంతా మరణించిన తరవాత గాంధారి, ధృతరాష్ట్రులను ఓదార్చడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. పుత్రశోకంతో ఉన్న గాంధారి కృష్ణుడితో ‘నాకు వందమంది కొడుకులు పుట్టారు, యుద్ధంలో అందరూ మరణించారు. కనీసం ఒక్కడినైనా బతికించలేక పోయాడు భగవంతుడు’ అంది బాధగా. శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ ‘అత్తా! నీ భర్తకు చూపులేదు. అందుకే ఆయన తన సంతానాన్ని చూసుకోలేకపోయాడు. నీకు చూపు ఉంది కానీ భర్తమీద ప్రేమతో కళ్లకు గంతలు కట్టుకున్నావు. కన్నతల్లే చూడని వారిని భగవంతుడు చూడలేదని ఎలా నెపం వేస్తావు?’ అన్నాడు. కళ్లు ఉండీ చూడలేని తల్లి ఆలనా కరువైంది. అంధుడైన తండ్రి అతి మమకారంతో, మోహంతో పిల్లలను అదుపు చేయలేదు. ఈ విధంగా తల్లిదండ్రులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పర్యవసానం అనర్థదాయకమేననడానికి ఇంతకన్నా రుజువేం కావాలి?
బాల్యంలో తాము అనుభవించిన కష్టాలూ, సమస్యలు తమ పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకని పిల్లల కోరికలు తీర్చడానికి తమ తలకుమించి ప్రయత్నిస్తుంటారు. దాంతో కుటుంబ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేని పిల్లలు నేల విడిచి సాము చేస్తారు, గాలిలో మేడలు కడతారు. నైతిక విలువలకు తిలోదకాలిస్తారు. న్యాయం, ధర్మం అంటే తెలియక అక్రమ దారులు పడతారు. దాంతో సమాజంలో అకృత్యాలు, అరాచకాలు విజృంభిస్తాయి. గాంధారి కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. పిల్లలకు తొలి గురువులు తల్లిదండ్రులే. వారికి నీతి నియమాలు, ప్రేమానుబంధాలు, మానవీయ విలువలను ఉగ్గుపాలతో నేర్పాలి. పెద్దవుతున్న కొద్దీ ఆ పాఠాల పరిధిని పెంచుతూ కుటుంబ ఆర్థిక స్థితిగతులు, సామాజిక సంబంధాల గురించి చెప్పాలి. ఉచితానుచితాలు బోధపరిచి సరైన దారిలో పెట్టాలి. పిల్లలు హోదాలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ తమను మించిన మంచివారు కావాలని ఆశించాలి. ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని విలుకాడు తన ధనుస్సును శక్తికొలది వంచుతాడు. అందులోంచి దూసుకుపోయే బాణాల్ని ప్రేమించినట్లే తన చేతిలో స్థిరంగా ఉన్న ధనుస్సునీ ఆ విలుకాడు ప్రేమిస్తాడు. ఖలీల్ గిబ్రాన్ అన్నట్లు తల్లిదండ్రులు ధనుస్సులైతే పిల్లలు దానినుంచి వెలువడే బాణాలు. ఆ విలుకాడే పరమాత్మ. ఆయన గీతోపదేశానికి తల్లిదండ్రులు ఎంతగా తలొగ్గితే పిల్లల భవిష్యత్తుకు అంత మంచిది.





