
2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడులు జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు మనమంతా చాలా విన్నాం. సీఎస్టీ రైల్వే స్టేషన్‌లో కాల్పులు, తాజ్ హోటల్‌లో మంటలు, నారిమన్ హౌస్ ముట్టడి గురించి చాలా కథనాలు వచ్చాయి. కానీ, ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఖచ్చితంగా నిరూపించిన ఒక ముఖ్యమైన రహస్యం.. ముంబైకి దూరంగా, జపాన్‌కు చెందిన ఒక ఇంజిన్ కంపెనీ తయారీ ప్రక్రియలో దాగుంది.
దాడి జరగడానికి మూడు రోజుల ముందు, నవంబర్ 23, 2008న, ఎం.వి.కుబేర్ అనే మన భారతీయ చేపల పడవ.. అరేబియా సముద్రంలో వెళ్తోంది. కరాచీ నుండి బయలుదేరిన లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు.. ఆ పడవను అడ్డగించారు. అందులో ఉన్న మత్స్యకారులను కొట్టి, కట్టేసి చంపేశారు. అయితే, అందులో ఉన్న భారత మత్య్సకారుడు కేప్టెన్ అమర్‌సింగ్ సోలంకిని చంపలేదు. ఎందుకంటే.. పడవ భారతదేశ తీరం వైపు నడిపించడానికి అతడు అవసరం కాబట్టి. ఆ సమయంలో, ఒక మత్స్యకారుడు రేడియో ద్వారా ఏదోలా హెచ్చరిక పంపినా.. అప్పటి సముద్ర కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల ఆ సమాచారం ఎవరికీ అందలేదు.
నవంబర్ 26 రాత్రికి, ఉగ్రవాదులకు ముంబై తీరం కనిపించింది. ఆ వెంటనే కేప్టెన్ సోలంకిని చంపేశారు. వారు కరాచీ నుండి తెచ్చుకున్న గాలితో నింపే చిన్న పడవను (డింగీ) సిద్ధం చేసుకుని, వారి బాస్‌లు ఇచ్చిన GPS కోఆర్డినేట్‌లను చూసుకుంటూ ముంబై నగరం వైపు దూసుకెళ్లారు. ఆ తర్వాత 60 గంటల్లో జరిగిన భయంకరమైన హింస గురించి మళ్లీ చెప్పాల్సిన పనిలేదు. ఆ దాడిలో 166 మంది చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు.
దాడులు జరిగిన వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ముంబై తీరంలో వదిలిపెట్టిన ఎం.వి.కుబేర్ పడవను కనుగొన్నారు. అందులో సోలంకి శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఉర్దూ భాషలో లేబుల్ ఉన్న ఫుడ్ ప్యాకెట్లు, కరాచీకి సంబంధించిన నావిగేషన్ సమాచారం, పాకిస్తాన్‌కు కనెక్ట్ అయిన శాటిలైట్ ఫోన్ కాల్స్.. ఇవన్నీ దర్యాప్తుకు మొదటి ఆధారాలుగా దొరికాయి. కానీ, అన్నిటికంటే ముఖ్యమైన ఆధారం పడవ వెనుక వైపు కనిపించింది. ఉగ్రవాదులు ఉపయోగించిన చిన్న పడవకు బిగించిన ఒక యమహా ఇంజిన్.
ఉగ్రవాదులు, ఈ ఇంజిన్ ఎక్కడిదో తెలియకుండా ఉండేందుకు, దానిపై ఉన్న ప్రత్యేక గుర్తింపు నెంబర్‌ను (unique identification number) చెరిపేయడానికి ప్రయత్నించారు. కానీ, వారికి తెలియని విషయం ఏంటంటే.. యమహా కంపెనీ ఆ ఇంజిన్‌లో, సిలిండర్ కింద ఒక లోతైన ప్రదేశంలో, రెండో రహస్య నెంబర్‌ను కూడా చెక్కారు. అది ఉన్న సంగతి కేవలం ఆ కంపెనీకి మాత్రమే తెలుసు.
అయితే ఈ దాడిలో ఆరుగురు అమెరికన్లు కూడా చనిపోవడంతో.. అమెరికాకు చెందిన FBI కూడా దర్యాప్తులో చేరింది. వారు యమహా కంపెనీని సంప్రదించారు. జపాన్‌లో ఉన్న కంపెనీ టెక్నీషియన్ ఆ దాచిన నెంబర్‌ను ఎలా చూడవచ్చో వివరించారు. మన భారతీయ దర్యాప్తు అధికారులు దాన్ని తెరిచి చూస్తే, ఆ రహస్య నెంబర్ చెక్కుచెదరకుండా దొరికింది. ఆ నెంబర్ సహాయంతో అది కరాచీలోని ఒక షాపులో అమ్మినట్లు తెలిసింది. ఆ షాపు యజమానితో ఆరా తీస్తే.. అదే రకమైన ఎనిమిది ఇంజిన్లను లష్కరే తోయిబాకు డబ్బు ఇచ్చే అమ్జద్ ఖాన్ అనే వ్యక్తికి అమ్మినట్లు ధృవీకరించాడు.

చిన్నగా, ఎవరికీ కనిపించకుండా ఉన్న ఆ సీరియల్ నెంబరే.. ఈ 26/11 దాడికి, పాకిస్తాన్ దేశంతో సంబంధం ఉందని నిరూపించే బలమైన ఆధారంగా మారింది.
తర్వాత జరిగిన దర్యాప్తులో, ఈ దాడులకు సంబంధించిన హెచ్చరికలను కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసింది. 2008 ఆగస్టు నుండి నవంబర్ మధ్య, ముంబైపై దాడి జరగవచ్చని అమెరికా, ఇజ్రాయెల్, మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి చాలా హెచ్చరికలు వచ్చాయి. కొన్నిటిలో దాడి జరిగే మార్గం, పద్ధతి గురించి కూడా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా, వాటిని ఉపయోగించుకుని సరైన రక్షణ చర్యలు తీసుకోలేకపోయింది.
వాస్తవానికి, 26/11 విషాదం అనేక కోణాలు ఉన్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి అమాయకులను కాపాడిన పోలీసు అధికారుల ధైర్యం ఒకవైపు. ముంబై తీరంలోకి ఎటువంటి అడ్డంకులు లేకుండా దిగడానికి దారితీసిన లోపాలపై ఉన్న నిర్లక్ష్యం మరొకవైపు. అప్పటి ప్రభుత్వం ఆ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుని ఉంటే, ఈ దాడులను అడ్డుకోగలిగే అవకాశం ఉండేది. సరైన సమయంలో హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల, కేవలం 10 మంది ఉగ్రవాదులు వందల కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణించి, భారత పడవను హైజాక్ చేసి, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే.. అతి ముఖ్యమైన తీరాల్లో ఒకటైన ముంబైకి ఎలాంటి అడ్డంకులు లేకుండా రావడం.. ఎన్నో లోపాలను గుర్తు చేస్తుంది.





