ప్రస్తుత కాలంలో వేగంగా పెరుగుతున్న ప్రపంచ జల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్‌కు చెందిన ఒక కుటుంబం అరుదైన ప్రయత్నం ప్రారంభించింది. గంగోత్రి ధామ్ నుంచి రామేశ్వరం వరకు 3,300 కిలోమీటర్ల పొడవున జల జాగరణ పాదయాత్ర చేపట్టి దేశానికి సందేశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రయాణంలో భాగంగా పాదయాత్ర బృందం మసూరీకి చేరుకోగా, స్థానికులు ఆత్మీయంగా స్వాగతించారు.
రోబిన్ సింగ్ కుటుంబం నేతృత్వంలో ప్రయాణం
జల జాగరణ పాదయాత్రకు రోబిన్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. గంగోత్రి నుంచి తీసుకొచ్చిన గంగాజలాన్ని రామేశ్వరం చేరుకొని భగవాన్ శివుడి వద్ద అబిషేకం చేయడం ప్రయాణ ముఖ్య ఉద్దేశ్యం. యాత్ర మొత్తం 9 రాష్ట్రాలు, 45 జిల్లాలు దాటుతుంది. అన్వేషణ, అవగాహన, ప్రజల్లో చైతన్యం కల్పించడం లక్ష్యంగా ప్రయాణించే బృందంలో రోబిన్ సింగ్ భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
చిన్నారులే యాత్రకు ప్రాణం!
పాదయాత్రలో 8 ఏళ్ల అభిరాజ్, 6 ఏళ్ల పీయూశ్ పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్నారులు ప్రతి అడుగులోనూ నీరు- జీవం అనే సందేశాన్ని చెబుతుండటంతో స్థానికులు పదేపదే వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద కార్యక్రమంలో భాగమవడం దేశ భవిష్యత్తుకు ఓ మంచి సంకేతమని పలువురు అభిప్రాయపడ్డారు.
భూమిని కాపాడే సంకల్పం: రోబిన్ సింగ్
పాదయాత్ర ఉద్దేశ్యాన్ని వివరించిన రోబిన్ సింగ్ మాట్లాడుతూ, “జీవితం, అడవి, భూమి, నీరు- ఇవి మాటలు మాత్రమే కాదు, జీవనాధారం. ఇవి క్షీణిస్తే మన భవిష్యత్తు చీకటిలో పడుతుంది” అని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో నీటి విలువపై చర్చ మొదలయ్యేలా చేయడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
మసూరీలో ప్రజల నుంచి భారీ ఆదరణ
మసూరీకి చేరుకున్న యాత్ర బృందాన్ని స్థానిక సామాజిక కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. సామాజిక కార్యకర్త పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ, “3300 కిలోమీటర్లు నడవడం చిన్న విషయం కాదు. ఇలాంటి కుటుంబాలు ముందుకు వస్తే సమాజం మార్పు దిశగా అడుగులు వేస్తుంది” అని అన్నారు. మసూరీలో విశ్రాంతి తీసుకున్న తర్వాత యాత్ర బృందం మంగళవారం ఉదయం దెహ్రాదూన్ వైపు ప్రయాణం ప్రారంభించింది. మసూరీ ప్రజల స్నేహం తమకు కొత్త శక్తినిచ్చిందని రోబిన్ సింగ్ తెలిపారు.
2026 మార్చిలో రామేశ్వరం వైపు!
పాదయాత్ర ఉత్తరాఖండ్ నుంచి దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల మీదుగా 2026 మార్చిలో రామేశ్వరం చేరుకోనుంది. అక్కడ శివుడి వద్ద గంగాజలంతో అభిషేకం చేసిన తర్వాత యాత్ర ముగుస్తుంది. రోబిన్ సింగ్ మాట్లాడుతూ, “శివలింగంపై నీరు అర్పించడం ఆచారం మాత్రమే కాదు, ప్రకృతి రక్షణకు సూచిక. నీరు ఉంటేనే జీవనం ఉంటుంది” అని వివరించారు.
ప్రకృతితో చేసిన సంభాషణ
పాదయాత్రలో అడుగు ముందుకు వేసే కొద్దీ ప్రకృతిని దగ్గరగా చూడగలిగామని రోబిన్ తెలిపారు. పర్వత ప్రాంతాల్లో నడుస్తూ అరుదైన చెట్లు, ఔషధ మొక్కలు, స్థానిక సంస్కృతి గురించి తమ కుటుంబం ఎన్నో విషయాలు నేర్చుకుందని చెప్పారు. “ఆక్సిజన్ కొరత ఏంటో కోవిడ్ కాలంలో చూశాం. కానీ నీళ్లు పోతే దాని భయం ఇంకా పెద్దది. ప్రపంచంలో నీటి కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే మన తరాలు మనల్ని క్షమించవు” అని హెచ్చరించారు. నీటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుని బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.





