
ఆమె ఫార్మసీ రంగంలో రాణించాలనుకున్నారు… కానీ, ఆర్థిక పరిస్థితులు… వెటర్నరీ వైపు నడిపించాయి. అయితేనేం, అందులోనూ అద్భుతాలు చేస్తున్నారు. ముఖ్యంగా పశువులకు కృత్రిమ గర్భధారణ పద్ధతులను చురుగ్గా అమలు చేస్తున్నందుకే నంద్యాల జిల్లా చింతకుంట జూనియర్ వెటర్నరీ అధికారిణి అనురాధను ‘జాతీయ గోపాలరత్న అవార్డు’ వరించింది. ఈ సందర్భంగా ఆమెను వసుంధర పలకరించింది.
నా స్వస్థలం నంద్యాల. నాన్న సుబ్బరాయుడు రజక వృత్తి చేస్తూ నన్ను చదివించారు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఇంటర్ బైపీసీ గ్రూపు తీసుకుని 75శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. తరవాత ఫార్మసీ కోర్సులో చేరాను. ఈ రంగంలో రాణించాలనేది నా లక్ష్యం. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి. దీంతో ఫార్మసీని వదిలి ఆ పరీక్షకు సన్నద్ధమవ్వడం మొదలుపెట్టా. 2004వ సంవత్సరంలో నిర్వహించిన ఈ పరీక్ష కోసం 350 మంది పోటీపడ్డారు. ఎంపికైన ఆరుగురిలో నేనొకదాన్ని. శిక్షణ అనంతరం 2006లో బండి ఆత్మకూరులో తొలి పోస్టింగు. 2013లో లైవ్ స్టాక్ అసిస్టెంట్‌గా, 2019లో జూనియర్ పశువైద్య అధికారిణిగా పదోన్నతి పొందాను. తర్వాత కొన్నాళ్లు గోపవరంలో విధులు నిర్వర్తించా. ఆ సమయంలోనే దేశంలో పశుసంపదను పెంచడానికి కేంద్రం ‘సెక్స్ సోర్టిడ్ సెమెన్ కృత్రిమ గర్భధారణ’ (ట్రిపుల్ ఎస్ ఏఐ) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది పాడి రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందనే ఆలోచనతో పశువులకు పెద్ద ఎత్తున కృత్రిమ గర్భధారణలు చేయించా. దీనివల్ల 2024-25వ సంవత్సరంలో 345 వరకు మేలుజాతి పెయ్య దూడలు జన్మించాయి. ఆ కృషికే ‘జాతీయ గోపాలరత్న అవార్డు’కు ఎంపికయ్యా. దేశం మొత్తమ్మీద అన్ని కేటగిరీలకు కలిపి మొత్తం 2,081 మంది పోటీపడగా మూడు కేటగిరీల్లో కేవలం 9మందికి అవార్డులను ఇవ్వనున్నారు. వారిలో నేను జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచా. ఈ నెల 26వ తేదీన అవార్డుని అందుకోనున్నా.
కష్టపడి ఒప్పించా…
ట్రిపుల్ ఎస్ ఏఐ విధానానికి రైతులను ఒప్పించడం కొద్దికాలం కిందటి వరకూ కష్టంగానే ఉండేది. ఆ అధునాతన విధానంలో గేదెలకు కృత్రిమ గర్భధారణ చేయడానికి అయ్యే ఖర్చూ ఎక్కువే. అయినా వెంటనే ఫలితం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో రైతులపై ఒకింత ఆర్థికభారం పడుతుండడంతో వారు వెనకాడేవారు. అయినా సరే, ఓపిగ్గా వారికి నచ్చజెప్పేదాన్ని. క్రమంగా వారిలో మార్పు వచ్చింది. ఈ ప్రయత్నానికే ఈ ఏడాది స్వాతంత్య్రదినోత్సవం రోజున నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగినిగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నా. రాష్ట్రస్థాయిలో అత్యధిక చూలు శాతం సాధించి 2023లో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చేతుల మీదుగా అవార్డునీ అందుకున్నా.





