ArticlesNews

సనాతన సంప్రదాయంలో గురువుది పరమోత్కృష్ట స్థానం

113views

జన్మనిచ్చే తల్లి, స్వశక్తి వచ్చేవరకు పోషించే తండ్రీ దైవ సమానులు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానమనే వెలుగులోకి నడిపించే మార్గాన్ని చూపించే గురువు పరబ్రహ్మ స్వరూపుడని భారతీయుల భావన. సనాతన సంప్రదాయంలో గురువుది పరమోత్కృష్ట స్థానం. సమాజం వ్యక్తుల సమష్టి స్వరూపం. వ్యక్తి మారనిదే సమాజం మారదు. వ్యక్తిని తీర్చిదిద్దడం సమాజ బాగుకు ప్రాథమిక అవసరం. అది గుర్తించిన జాతి ఆ మహత్తర కార్యం కోసం నిర్మించుకున్న వ్యవస్థకు ప్రతినిధి గురువు.

గురువంటే ఎల్లవేళలా శిష్యుల పట్ల జాగరూకత గలవాడని అర్థం. తల్లికి సర్వకాల సర్వావస్థల్లోనూ సంతానం యోగక్షేమాల మీద శ్రద్ధ ఉన్నట్లు గురువుకు శిష్యులపై సర్వదా సమభావన ఉండాలి. శిష్యుణ్ని తన స్థాయికి లేదా తనను మించిన స్థితికి చేర్చాలన్న పట్టుదల ఉండాలి. అప్పుడే ఆ గురుత్వం సార్థకమవుతుంది. వేద పదార్థ విజ్ఞానం, సమదృష్టి, పరిశుద్ధత, సుఖదుఃఖాలకు లోబడకుండా ఉండటం, ఇది నాది నేను చేస్తున్నాను అనే భావన లేకుండడం, శిష్యుణ్ని తరింపజేయాలనే భావం, బోధనాసక్తి, దయ మొదలైన సద్గుణాలు గలవారు నిజమైన గురువులని సంప్రదాయ భావన. నవ్వుతూ మాట్లాడటం, కపట ప్రవర్తన- ధనాసక్తి లేకపోవడం, శిష్యుల పట్ల అపారమైన వాత్సల్యం సద్గురువు లక్షణాలు. మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు గురువు ఉన్నతిని వివరిస్తూ తల్లిదండ్రుల వల్ల కలిగిన శరీరం మొదటి జన్మ అయితే, సద్గురువు ఉపదేశంతో రెండో జన్మ ప్రాప్తిస్తుందనీ అది చరితార్థమనీ చెబుతాడు. ఎన్ని పుస్తకాలు చదివినా, సహజ మేధాసంపత్తితో ఎంత విజ్ఞానం సంపాదించినా అనుభవజ్ఞుడైన గురువు సాయం లేనిదే మన ధ్యేయం నెరవేరదు. ‘శాస్త్రమాచార్య సన్నిధి చదవడేని…’ ఆ విద్య పరిపూర్ణం కాదన్నాడు శ్రీనాథ కవి. గురూపదేశం పుస్తక పఠనం వల్ల సమకూరే విజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చి వివేచనా శక్తినీ, విశ్లేషణా సామర్థ్యాన్నీ కలిగిస్తుంది. శ్రీరాముడికి వసిష్ఠుడు, ఒక దశలో విశ్వామిత్రుడూ గురువులయ్యారు. బలరామకృష్ణులు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశారు. రామకృష్ణ వివేకానందులు అపూర్వ గురుశిష్యులు.

సూర్యుడు లేకుండా వెలుగు లేదు. ఔషధం సేవించకుండా రోగం నశించదు. గురువు లేకుండా జ్ఞానం లభించదు- అని పెద్దల మాట. పరసవేది ఇత్తడిని పుత్తడిగా మారుస్తుందని పూర్వం చెప్పేవారు కానీ నిజానికి ఇత్తడిని పరసవేదిగా మార్చగల శక్తి గురువుకు ఉంది. నువ్వేమిటో నీకు తెలియజెప్పేవాడు గురువు అంటారు ఆధ్యాత్మికవేత్తలు. తండ్రి పిల్లవాణ్ని వేలుపట్టుకుని నడిపిస్తున్నట్టు తనను అనురిస్తున్న శిష్యుణ్ని గురువు వెలుగుబాటపై నడిపిస్తాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని వేమన సూక్తి. భౌతికంగా చూపు లేనివాడు జీవులనో వస్తువులనో ఎలా దర్శించలేడో గురువు లేనివాడూ అలాగే జ్ఞానాన్ని యథాతథంగా గ్రహించలేడు.

వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాల్ని వెలిగించగలదు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి కావాలి. ఇప్పటి అవసరాలకు తగినట్టుగా తమ జ్ఞానాన్ని నవీకరించుకోవాలి. ఉద్యోగాల కోసం చదివే చదువుల్లోనే కాదు, నాట్య సంగీతాది కళల్లోనూ గురుశిష్య సంబంధాలు పటిష్ఠంగా ఉంటే విలువలతో కూడిన విజ్ఞాన సమాజం నెలకొంటుంది.