
ఎర్రకోట పేలుడు కేసులో కీలక నిందితుడు డా.ఉమర్ నబీ, ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌కు చెందిన డా.ముజమ్మిల్ గనాయీ తదితరులు 2021లో తుర్కియేకు వెళ్లారని.. ఆ దేశంలో వారు జైషే మహమ్మద్ ప్రతినిధులను కలిసినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా తుర్కియేతో సంబంధాలు ఉన్న సంస్థలపై అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) అధికారులు గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటింగ్ ప్రెస్‌పైనా దాడులు చేశారు.
ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రింటింగ్ ప్రెస్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచురిస్తున్నట్లు గుర్తించామని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీ, ఇతర పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2021లో డా.ముజమ్మిల్ గనాయీ, ఉమర్ తుర్కియే వెళ్లిన సమయంలో ఉమర్ ఓ విదేశీ హ్యాండ్లర్‌ను కలిశాడని.. ఈ హ్యాండ్లర్ భారత్‌లో టెర్రర్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేయడం, నిర్వహించడంపై వివరణాత్మక సూచనలు చేశాడన్నారు. పేలుడు పదార్థాలు, ఇతర వనరులను సేకరించడానికి తుర్కియే ఆధారిత నెట్‌వర్క్‌ల ద్వారా వారికి ఆర్థికసాయం అందిందని తెలిపారు. దీంతో తుర్కియేతో సంబంధాలు ఉన్న సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నిందితుల విచారణ ప్రకారం.. 2021లో డా.ముజమ్మిల్ గనాయీ, ఉమర్ తుర్కియే వెళ్లొచ్చిన తర్వాత బహిరంగ మార్కెట్ నుంచి పెద్దఎత్తున రసాయనాలు సేకరించడం ప్రారంభించారు. వీటిలో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అల్ ఫలా విశ్వవిద్యాలయ ప్రాంగణం సమీపంలో నిల్వ చేశారు. డిసెంబర్ 6న (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు) భారీ పేలుళ్లకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతలోనే ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ కుట్ర బయటపడింది. ఇదికాస్త ఉమర్‌లో భయాందోళనకు దారితీయడం.. చివరకు ఎర్రకోట సమీపంలో ముందుగానే పేలుడు చోటుచేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
పేలుడుకు వారం ముందు ఫోన్‌ను సోదరుడికి ఇచ్చిన ఉమర్
దిల్లీ పేలుడుకు కారణమైన నిందితుడు ఉమర్ ఎర్రకోట వద్ద పేలుడుకు వారం రోజుల ముందు కశ్మీర్‌కు వెళ్లాడని.. ఆ సమయంలో తాను వాడే ఫోన్‌ను తన సోదరుడు జహూర్‌కు అప్పగించాడని దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. విచారణలో జహూర్ మొదట తన సోదరుడి ఉగ్రదాడి ప్రణాళికల గురించి తనకు తెలిదని చెప్పినప్పటికీ.. తర్వాత ఉమర్ అతని ఫోన్‌ను తనకు ఇచ్చినట్లు తెలిపాడు. తన గురించి మీడియాలో ఏవైనా వార్తలు వస్తే ఫోన్‌ను వెంటనే నీటిలో పారేయాలని సూచించినట్లు తెలిపాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులోని డేటాను పరిశీలిస్తున్నారు.





