
మన చేతలే మనమేంటో నిరూపిస్తాయంటారు. ‘వృక్షమాత’గా పేరుగాంచిన సాలుమరద తిమ్మక్క జీవితమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! పిల్లలు పుట్టకపోయినా మొక్కల్నే తన కన్నబిడ్డలుగా భావించిందామె. అహర్నిశలూ వాటి సంరక్షణకే పరితపించింది. పర్యావరణ పరిరక్షణ కోసమే తన నిండు జీవితాన్ని అంకితం చేసిన ఈ గ్రీన్ వారియర్.. తాజాగా తన 114వ ఏట కన్నుమూసింది. దీంతో ఆమె నాటిన కొన్ని వందల మర్రి చెట్లు, కొన్ని వేల ఇతర వృక్షాలు అనాథలయ్యాయి. అయితే భౌతికంగా దూరమైనా.. తను నాటిన వృక్షాల రూపంలో మన మధ్యే ఉన్న ‘వృక్షమాత’ కథ ఇది!
కొన్ని వేల వృక్షాలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆమెకు ‘సాలుమరద తిమ్మక్క’ అనే పేరొచ్చింది. కర్ణాటకలోని గుబ్బి అనే ప్రాంతంలో 1911, జూన్ 30న జన్మించారు. పేద కుటుంబం కావడంతో చిన్నతనంలో బడికి వెళ్లి చదువుకోలేకపోయారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు దగ్గర్లోని క్వారీలో కూలి పనులకు వెళ్లేవారు తిమ్మక్క.

మొక్కలే ఆమె పిల్లలు!
పచ్చదనం, పర్యావరణానికి చిన్నతనం నుంచీ ఇట్టే ఆకర్షితులయ్యేవారు తిమ్మక్క. 1928లో అంటే తన 17వ ఏట చిక్కయ్య అనే వ్యక్తిని వివాహమాడారామె. అయితే ఈ జంటకు పిల్లలు పుట్టలేదు. అయినా బాధపడకుండా మొక్కల్నే తన కన్న బిడ్డలుగా భావించిందీ జంట. కొన్నేళ్ల తర్వాత ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు. ఇక ఓవైపు కూలి పనులకు వెళ్తూనే.. మరోవైపు పచ్చటి మొక్కల్ని సేకరించి తమ ఇంటి ప్రాంగణంలో నాటేవారు. ఇలా తన ఇంటి నుంచి ప్రారంభమైన హరిత విప్లవాన్ని తక్కువ సమయంలోనే హుళికల్-కూడూర్ రహదారికి విస్తరించారు తిమ్మక్క. తన భర్తతో కలిసి ఆ రోడ్డుకు ఇరువైపులా పదుల సంఖ్యలో మర్రి మొక్కల్ని నాటారు. ఏటేటా ఈ సంఖ్యను పెంచుకుంటూ పోయిన ఆమె.. కొన్నేళ్లకు ఆ ప్రాంతాన్ని హరిత వనంగా మార్చేశారు. కేవలం మొక్కలు నాటడమే కాదు.. రోజూ తన ఇంటి నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి మరీ వాటికి నీళ్లు పోసేవారు. ఇలా మొక్కల్నే తన ఆరో ప్రాణంగా భావించిన తిమ్మక్క.. వాటికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఇలా వరుసగా సుమారు 385 మర్రి వృక్షాల్ని పెంచిన ఆమెకు ఇందుకు గుర్తింపుగానే ‘సాలుమరద’ అనే పేరొచ్చింది. ఇవి కాకుండా దాదాపు 8 వేలకు పైగా ఇతర మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా పెంచి పెద్ద చేశారు. ఇలా అక్కడి బంజరు భూముల్ని సస్యశ్యామలం చేసిన ఘనత తిమ్మక్కకే దక్కుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు.
పోరాడి.. గెలిచి!
తాను పెంచి పెద్ద చేసిన మొక్కలకు చిన్న హాని తలపెట్టినా ఊరుకునే వారు కాదు తిమ్మక్క. అయితే 2019లో బాగేపల్లి-హలగూరు రోడ్డును విస్తరించాలని నిర్ణయించుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం తిమ్మక్క నాటిన వందలాది మర్రి చెట్లను నరకాల్సి వచ్చింది. కానీ ఇందుకు ససేమిరా అన్నారీ గ్రీన్ వారియర్. తాను పెంచి పెద్ద చేసిన మొక్కల్ని ఇలా తొలగించడం సరికాదని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారామె. ఆమె వినతిని స్వీకరించిన ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ని రద్దు చేసి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంది. ఇలా తన వృక్షాల్ని కాపాడుకునేందుకు ఓ చిన్నపాటి పోరాటం చేసి గెలిచారీ వృక్షమాత. 1991లో తన భర్త మరణించినా.. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఆపలేదామె. ఇలా తన చేతలతో పర్యావరణ పరిక్షకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెను.. దేశవ్యాప్తంగా నిర్వహించే అటవీ సంరక్షణ కార్యక్రమాలకు ఆహ్వానించేవారు. ఆ వేదికల పైనా మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రసంగిస్తూ ఎంతోమందిలో స్ఫూర్తి రగిలించారీ గ్రీన్ వారియర్.

‘పద్మశ్రీ’ పురస్కారం!
కొన్ని దశాబ్దాలుగా మొక్కలే తన ఆరో ప్రాణంగా, కన్నబిడ్డలుగా భావిస్తూ సమాజంలో పర్యావరణ స్పృహ పెంచిన తిమ్మక్క.. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ ‘వృక్షమాత’గా ప్రసిద్ధి చెందారు. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2019లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. దీంతో పాటు ‘నేషనల్ సిటిజన్ అవార్డు’, ‘ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు’.. ఆమెను వరించాయి. 2020లో కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో ఆమెను సత్కరించింది. 1999లో ఆమె జీవితం నేపథ్యంలో ‘Thimmakka Mathu 284 Makkalu’ పేరుతో డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఇది 2000లో ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో ప్రదర్శితమైంది. అలాగే బీబీసీ 2016లో విడుదల చేసిన ‘ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల, స్ఫూర్తిదాయక మహిళల’ జాబితాలోనూ తిమ్మక్క చోటు దక్కించుకున్నారు. ఇక ఓ యూఎస్ పర్యావరణ సంస్థకు తిమ్మక్క పేరు మీద ‘తిమ్మక్కాస్ రిసోర్సెస్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్’ అని పేరు పెట్టారు. ఇలా తన 114 ఏళ్ల సుదీర్ఘ జీవిత ప్రయాణంలో ఎన్నో ఘనతలు అందుకున్న ఈ ఎకో వారియర్.. 2025, 14నవంబరున కన్నుమూశారు. దీంతో ఆమె పెంచిన వందల వృక్షాలే కాదు.. యావద్దేశం చింతిస్తోంది. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా.. వృక్షాల రూపంలో తిమ్మక్క ఎప్పుడూ మన మధ్యే ఉంటారని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు తిమ్మక్క సంరక్షించిన మొక్కల బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.





