
గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించే ఉద్దేశ్యంతో ఆలయాల నిర్మాణాలకు ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. టీటీడీ శ్రీవాణీ భజన మండపం పథకం కింద రాష్ట్రంలో 500 దేవాలయాలను మంజూరు చేసిందని ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గం నుండి సరైన ప్రతిపాదనలు పంపాలని మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దీని ప్రకారం ఒక గ్రామంలో ఒక ఆలయానికి నిధులు మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా మత్స్యకారుల కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ ఇలా ఏదేని ఒక కాలనీలో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు అవసరం అయిన ప్రతిపాదనలు పంపించాలి అన్నారు. కనీసం సంబంధిత ఆలయానికి సంబంధించి 5 సెంట్ల స్థలం ఉంటే రూ. 10 లక్షలు, 8 సెంట్ల కంటే ఎక్కువ స్థలానికి 15 లక్షలు, 10 సెంట్ల కంటే ఎక్కువ ఉంటే 20 లక్షలు మంజూరు అవుతాయన్నారు.
ప్రతిపాదనలు పంపే వారు స్థానిక ప్రజాప్రతినిధుల లేఖలను, ఖాళీ స్థలం ఫోటోలను, ఆలయ ప్లాన్ జీపీఎస్ ఫోటోను జత చేయాల్సి ఉంటుందని వివరించారు.మరిన్ని వివరాలకు నిడదవోలులోని క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఆలయాల నిర్మాణంతో గ్రామాల్లో ఆధ్యాత్మికతతో పాటు భక్తి భావం పెరిగి ప్రశాంత వాతావరణం నెలకొంటుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.





