
పౌరసత్వ సవరణచట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనకారులు చేస్తున్న ఆందోళనను కొనసాగించుకోమని, ఎట్టిపరిస్థితుల్లోనూ సీఏఏను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం లఖ్‌నవూలో సీఏఏకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ, సీఎం మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌కు సవాలు విసిరారు. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాలు చేశారు.
‘సీఏఏ ద్వారా ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయము. పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆందోళనకారులకు నేను ఒకటే చెబుతున్నా.. మీరు మీ ఆందోళనలు చేసుకోండి. మేం మాత్రం సీఏఏని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. రాహుల్ జీ, అఖిలేశ్ జీ, మాయావతి జీ, మమతా జీ మీ అందరికీ ఇదే నా సవాల్. దేశంలో ఎక్కడైన సీఏఏపై బహిరంగ చర్చకు రండి. ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రతిపక్ష పార్టీల కళ్లను కప్పేశాయి’ అని ఎద్దేవా చేశారు.
‘పాకిస్థాన్ నుంచి ఎన్నో ఏళ్లుగా అక్రమ వలసదారులు, ఉగ్రవాదులు వస్తూ ఇక్కడ బాంబులు పేలుస్తుంటే మౌనముని బాబా మన్మోహన్ సింగ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అంటూ కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ లఖ్‌నవూలో ముస్లింలు గత వారం నుంచి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అటువంటి ప్రదేశంలో సీఏఏపై అవగాహన నిర్వహిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.