
సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ఈ నెల 8న నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కనకదాసు జయంతిని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించనున్నామని, ఈ ఉత్సవానికి మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు.
సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస తన కీర్తనలు, రచనలతో సమాజంలో అసమానతులపైనా, కుల వ్యవస్థపైనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కనకదాస చేసిన సేవలు శ్లాఘనీయమన్నారు. అటువంటి మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనందకరమన్నారు. గతేడాది అనంతపురంలో భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయింతిని నిర్వహించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.
ఈ ఏడాది అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతిని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండ్రోజుల్లో కూటమి ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపారు. నవంబరు 8న అన్ని జిల్లాల్లోనూ భక్త కనకదాస జయంతి నిర్వహించేలా ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొననున్నట్లు వెల్లడించారు.





