
ఖలీస్తానీ ఉగ్రసంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్‌పై బెదిరింపులకు దిగింది. ఆస్ట్రేలియాలో నవంబర్ 1వ తేదీన నిర్వహించబోయే కచేరీని నిలిపివేయాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడమే ఇందుకు కారణంగా ఎస్‌ఎఫ్‌జే చెబుతోంది.
అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌బనేగా కరోడ్ పతి సీజన్-17కి దిల్జీత్ దోసాంజ్ గెస్ట్‌గా వచ్చాడు. ఆ సమయంలో పంజాబ్ బిడ్డ అంటూ దిల్జీత్‌ను బిగ్‌బీ పరిచయం చేయగా.. దిల్జీత్ అమిత్ కాళ్లను తాకి ఆశ్వీరాదం తీసుకున్నాడు. ఈ ఇద్దరి ఆలింగనం తర్వాత షో కంటిన్యూ అయ్యింది. అయితే పవిత్రమైన తలపాగా ఉండగా అమితాబ్ లాంటి వ్యక్తి పాదాలను తాకడంపై సిఖ్స్ ఫర్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలే.. 1984 సిక్కుల ఊచకోతకు ప్రేరణగా మారాయి. అలాంలోడి పాదాలు తాకడం అంటే బాధితులందరినీ అవమానించడమే అని ఎస్‌ఎఫ్‌జే చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ పేరిట ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఇది అజ్ఞానం కాదు, విశ్వాస ఘాతకమేనని మండిపడింది. పైగా నవంబర్ 1వ తేదీని సిక్కుల ఊచకోత దినంగా గుర్తించిన నేపథ్యంలో.. అదే రోజున ఆస్ట్రేలియాలో కన్సర్ట్ నిర్వహించడం సిక్కు సమాజాన్ని అవమానించడమే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కన్సర్ట్‌ను రద్దు చేసుకోవాల్సిందేనని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. అంతేకాదు.. ఈ చేష్టలపై దిల్జీత్‌ను విచారించాల్సిందేనని కోరుతూ అకాల్ తఖ్త్ జథేదార్(అత్యున్నత ధార్మిక అధికారి) గియానీ కుల్దీప్ సింగ్ గర్గాజుకు లేఖ రాసింది.
పంజాబీ సింగర్ అయిన దిల్జీత్ దోసాంజ్‌కు మాములు క్రేజ్ లేదు. అందుకే Aura Tour పేరిట ఆస్ట్రేలియాలో కచేరీ నిర్వహించబోతున్నారు. ఈ టూర్ కోసం 800 డాలర్ల రేటుతో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. సుమారు 30 వేల మంది హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి.
అమితాబ్‌పై ఆరోపణలేంటి?..
1984లో ఇందిరా గాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు హత్య చేశారు. అయితే ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై హింసాత్మక దాడులు జరిగాయి(1984 సిక్కుల ఊచకోత). ఆ సమయంలో ప్రముఖ నటుడు, ఇందిరాగాంధీకి ఆప్తుడైన అమితాబ్ బచ్చన్ “ఖూన్ కా బదలా ఖూన్” (రక్తానికి ప్రతీకారంగా రక్తమే) అనే నినాదం ఇచ్చారని, ఈ వ్యాఖ్యలు అప్పటి పరిస్థితుల్లో హింసను ప్రేరేపించాయని కొన్ని వర్గాలు ఆరోపించాయి. దూర్‌దర్శన్‌లో ఆయన ఆ నినాదం ఇచ్చారంటూ జగదీష్ కౌర్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలను 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ప్రచురించింది కూడా.
దీంతో.. అమితాబ్ బచ్చన్ అకాల్ తఖ్త్ జథేదార్‌కు ఓ లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని.. నిరాధారమైనవని.. ఎంతో బాధ కలిగించాయని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను విమర్శించేవారు కూడా ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు కూడా 2014లో ఆయనపై కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఆరోపణలు ఇప్పటిదాకా నిరూపితం కాలేదు.





