
రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా, బ్రహ్మంగారిమఠం మండలంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నూతన అధిపతి నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బి.మఠంలో స్వామివారి శిష్యులు, భక్తులు, పలువురు మఠాధిపతులు, స్వామీజీలతో దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, డీసీ గురుప్రసాద్, ఏసీ మల్లికార్జున ప్రసాద్ మంగళవారం సమావేశమయ్యారు. తొలుత మఠాధిపతిగా నియామకానికి పోటీ పడుతున్న వేంకటాద్రి స్వామి, భద్రయ్య స్వామి, గోవింద స్వామి తమ అర్హతలకు సంబంధించిన పత్రాలను అధికారులకు అందించారు. అనంతరం స్వామివారి భక్తులు, శిష్యులు, మఠాథిపతులు, స్వామీజీలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా విన్నవించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. భక్తులు, శిష్యులు, స్వామీజీలు తెలిపిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐలు రమణారెడ్డి, శివశంకర్, ఐదు మంది ఎస్సైలు, వంద మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు.





