
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ అన్నారు. అంబాజీపేట మండలం నందంపూడిలో వడ్లమాని లక్ష్మీనారాయణ అవధాని స్మృత్యర్థం ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య ఘనపాఠి ఆధ్వర్యాన వడ్లమాని లక్ష్మీనారాయణ మెమోరియల్ ట్రస్ట్ పేరిట వేద సభ నిర్వహించారు. మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంస్కృతీ సంప్రదాయాలకు భారతదేశం, కోనసీమ వేద పండితులకు పుట్టినిల్లని అన్నారు. వేద పండితులకు ఎన్నో ఆర్థిక సమస్యలున్నాయని, అయినప్పటికీ వేదాల ప్రాశస్త్యాన్ని, అర్థాలను సమాజానికి చాటి చెబుతున్నారని అన్నారు. ఇలాంటి వేదసభలు గ్రామ స్థాయిలో కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తే వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పడంతో పాటు వేదాలకు, వేద పండితులకు ఎంతో గుర్తింపు లభించి, వారి ఆర్థిక సమస్యలు తీరుతాయని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ సమక్షంలో వేద పండితులు సుమారు గంటసేపు వేదస్వస్థి గావించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. తొలుత సుబ్రహ్మణ్య ఘనపాఠి ఆధ్వర్యాన వేద పండితులు జస్టిస్ రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.




