News

2040లో చందమామపైకి భారత వ్యోమగామి : ఇస్రో చీఫ్‌ నారాయణన్‌

283views

భారత అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్‌ వీ నారాయణన్‌ తెలిపారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్-VOM తయారీ వంటి లక్ష్యాలను ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI, రోబోటిక్స్, బిగ్ డేటా వంటివాటిని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

2040లో వికసిత భారత్‌ దూతగా భారతీయ వ్యోమగామి చందమామపై అడుగుపెట్టనున్నాడని నారాయణ్‌ తెలిపారు. 2027లో చేపట్టబోయే మానవసహిత అంతరిక్షయాత్ర మిషన్‌ ట్రాక్‌లో ఉందని వెల్లడించారు. 2040 నాటికి తొలి మానవసహిత చంద్రయానం చేపట్టాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.

చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు 2027లో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-4 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్‌ తెలిపారు. కొన్నేళ్ల క్రితం అంతరిక్షరంగంలో రెండు లేక మూడు స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలపై అధ్యయం కోసం 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్‌ అన్నారు.