
జ్యోతి పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకూ ‘గో రక్షకులు’ అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. సెప్టెంబర్ 13న చేపట్టిన ‘గోమాతా సంకల్ప’ యాత్ర ముగింపు సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
“యాత్రలో బిహార్ మూలాలు క్షుణ్ణంగా పరిశీలించాను. ఇక్కడంతా సంస్కృతి, సంప్రదాయ విలువకు కట్టుబడి ఉన్నారు. మొత్తం 38 జిల్లాల ప్రజలు ‘గో రక్షణ’ మద్దతునిచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సమస్యను విస్మరిస్తున్నందున.., గో పరిరక్షణకు కట్టుబడిన అభ్యర్థులను పోటీకి నిలబెడుతున్నాము” అన్నారు. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు ప్రారంభించారని, ఈ ప్రక్రియ పూర్త య్యాక పేర్లను వెల్లడిస్తామన్నారు. పేర్ల గోపత్యతో వారికి ఎలాంటి రాజకీయ ఇబ్బందులు రాకుండా చూడొచ్చాన్నారు. అయితే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ‘గో రక్షక్’ అభ్యర్థులకు ప్రచారం చేయడంతో పాటు వారికి విజయానికి తన వంతుగా ధన సాయం చేస్తానన్నారు. గో సంరక్షకులు అని చెప్పుకొనే కొన్ని పార్టీలు గోవధ చేసే వారి నుంచే ముడుపులు తీసుకుంటున్నాయని
ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.
తాను ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని, మోదీ శ్రేయస్సు కోరుకునే వారిలో ప్రథముడని చెప్పుకొచ్చారు. “నేను రాజకీయాలు చేయడం లేదు. ధర్మ రక్షణ బాధ్యత నిర్వర్తిస్తున్నాను. గోవులను చంపేవారు, గో మాంసం తినేవారు పాపులతో సమానం. అలాంటి రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వకూడదు” అంటూ అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రజలకు పిలుపునిచ్చారు.





