ArticlesNews

సనాతన ధర్మ సంరక్షకుడై..

MP Chief Minister Invites Intersex Activist To Inaugural Ceremony Of 108 Adi Shankara Statue At Omkareshwar - 1
259views

దేవుడిపై విశ్వాసం లోపించి, సనాతన ధర్మానికి హాని కలుగుతున్న సమయంలో ఆదిశంకరులు అవతరించి వైదిక సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేశారు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. జీవుడికి, దేవుడికి భేదం లేదని ప్రతిపాదించారు.

ఏకసంథాగ్రాహి అయిన శంకరులు బాల్యంలోనే సమస్త విద్యలూ అభ్యసించారు. తండ్రి చిన్ననాడే దూరమైనా తనను కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిని ప్రాణప్రదంగా చూసుకున్నారు. సన్యాసి అయినా మాతృమూర్తి కడపటి క్షణాల్లో చెంతనే ఉన్నారు. అంతిమసంస్కారాలు చేసి ఆమె రుణం తీర్చుకున్నారు. శంకరాచార్యులు గోవింద భగవత్పాదులకు శిష్యరికం చేశారు. వారి ఆదేశం మేరకు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసేందుకు కాశీకి వెళ్లారు. తర్వాత బదరీనాథ్‌కి ప్రయాణమయ్యారు. అక్కడ పన్నెండు సంవత్సరాలు ఉండి ఉపనిషత్తులు, భగవద్గీతకు వ్యాఖ్యానం రచించారు.

శాఖోపశాఖలుగా చీలిపోయిన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను క్రోడీకరించి, ఆదిశంకరులు ఆరు ఆరాధనా మార్గాలను ఏర్పరిచారు. షణ్మత స్థాపనాచార్యుడిగా జగత్‌ ప్రసిద్ధులయ్యారు. ప్రస్తుతం ఉన్న షోడశోపచార పూజావిధానం, క్షుద్ర, తాంత్రిక విధానాల్లో ఉపయోగించే శ్రీచక్రాన్ని ప్రసాదించినవారు ఆదిశంకరులే! అలాగే సకల దేవతామూర్తులకు సంబంధించిన స్తోత్రాలను మానవాళికి అందించిన ఘనత కూడా ఆ జగద్గురువుదే! ఆసేతు హిమాచలం పాదచారులై పర్యటించి వైదికమత ప్రాశస్త్యాన్ని చాటారు. దేశం నలు దిక్కులా నాలుగు మఠాలను స్థాపించారు. అందుకే ‘శ్రీశంకరాచార్యుల రచనలు అధునాతన ప్రపంచంలో అద్భుతసృష్టికి నిదర్శనాలు. మనదేశ పవిత్రతను, పూర్వవైభవాన్ని పునరుద్ధరించిన మహానుభావుడు ఆదిశంకరులు’ అని కొనియాడారు స్వామి వివేకానంద.