News

శంఖు కళాకృతుల జగన్నాథ్‌..

218views

ఒడిశాలోని పూరీకి చెందిన ప్రఖ్యాత శంఖు కళాకారుడు జగన్నాథ్‌ ప్రధాన్‌.. సంప్రదాయ శంఖు ఆకృతులకు ఆధునికత, కళాత్మకత జోడించి సరికొత్త రూపాల్లో తయారు చేస్తున్నారు. 25 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్న ఆయన.. తనదైన కళా నైపుణ్యాలతో జాతీయ స్థాయిలోనూ అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటికి గుర్తింపు తేవడమే తన లక్ష్యమంటున్నాడు.

జగన్నాథ్‌ తండ్రి రఘునాథ్‌ మోహపాత్ర కూడా శంఖు కళాకారుడు. ఆయన నుంచి నైపుణ్యాలను నేర్చుకున్న ప్రధాన్‌.. శంఖులతో గృహాలంకరణ వస్తువులు, పెయింటింగ్స్‌, ఆభరణాలు తదితర వస్తువుల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. శారీ పిన్నులు, లాకెట్‌లు, పెన్ను స్టాండ్‌లు మొదలుకొని.. బొమ్మలు, విగ్రహాలు, అనేక అలంకరణ వస్తువులను శంఖులతో తయారు చేస్తుండడంతో స్థానికంగా ఎంతో ప్రాచుర్యం పొందారు.

ఈ కళాకృతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తూ విభిన్న పెయింటింగ్‌లతో వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. స్థానిక యువత, మహిళలకు శిక్షణ ఇస్తున్న ఆయన పూరీలోనే దాదాపు 50 కుటుంబాలకు సహకారం అందించినట్లు చెప్పారు. అనేక ఎగ్జిబిషన్‌లలో తన ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వీటికి ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

తన కళా నైపుణ్యాలతో రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు పొందారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి జాతీయ అవార్డును అందుకోవడంతోపాటు మాజీ ప్రధాని వాజ్‌పేయీ వంటి అగ్రనేతల ప్రశంసలూ అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అవార్డులు పొందడంతో పాటు హరిణాయా నుంచీ పురస్కారం పొందారు. సొంతగా వృత్తి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.