
ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువు అవుతున్న బంగ్లాదేశ్లో మరో పెద్ద వివాదం చెలరేగుతుంది. బంగ్లాదేశ్ జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాల్లో సంగీతం, డాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహ్మద్ యూనస్ యంత్రాంగం ప్రతిపాదించింది. దీని ద్వారా పిల్లల్లో కళలు, సాంస్కతిక, సజనాత్మకత పెరుగుతుందని ఆశించింది. అయితే ఈ విధానాన్ని జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి నిరసనగా ఆందోళనలను మొదలెట్టాయి. చిన్న వయసులోనే సంగీతం, నృత్యం నేర్పించడం వల్ల మతపరమైన విద్య దెబ్బతింటుందని, ఈ కారణంగా పిల్లలు నాస్తికులుగా తయారవుతారని రాడికల్ సంస్థలు చెబుతున్నాయి. దాంతో పాటూ ఇస్లాం పట్ల విశ్వాసం కోల్పోతారని చెబుతున్నాయి. ఈ కళల స్థానంలో పాఠశాలల్లో మతపరమైన, నైతిక విద్యను తప్పనిసరి చేయాలని ఇస్లాం గ్రూపులు కోరుతున్నాయి.
తమ మాట వినకుండా ప్రైమరీ స్కూళ్ళల్లో ఆర్ట్స్ టీచర్లను నియమిస్తే కచ్చితంగా నిరసనలను పెంచుతామని రాడికల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. మతపరమైన టీచర్లను నియమించే వరకూ ఆందోళనలను ఆపేదే లేదని యునస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ఈ చర్య ఇస్లాం, ఖురాన్ సూత్రాలకు విరుద్ధమని చెబుతున్నారు. కాగా బంగ్లాదేశ్ ప్రభుత్వ చర్యను జమాత్ , ఇతర రాడికల్ గ్రూపులు నిరసిస్తుండగా, మహిళలు మరియు పిల్లల కోసం పనిచేసే సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రాథమిక పాఠశాల పిల్లలకు సంగీత ఉపాధ్యాయులను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయానికి మహిళా హక్కుల సంస్థ నరిపోక్ఖో మద్దతు ప్రకటించింది.





