News

నంది కోసం పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి

185views

పురాతన ఆలయంలో చోరీ అయిన నంది విగ్రహం రికవరీ కోసం ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నెల నాలుగో తేదీన శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి ముష్టికోవెల సమీపంలోని పురాతన శివాలయంలోని నంది విగ్రహం చోరీ అయ్యింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి పురోగతీ లేదు. దీంతో విసుగు చెందిన ముష్టికోవెల పంచాయతీ పరిధిలోని సుబ్బరాయనిపల్లి, బురుజుగుట్టపల్లి, గువ్వలగొందిపల్లి గ్రామాల ప్రజలు చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని బైఠాయించారు. చోరీకి సంబంధించి కొంత సమాచారం తెలియజేసినా ఇప్పటి వరకు దొంగలు పట్టుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిర్లక్ష్యం వీడి త్వరితగతిన దొంగలను పట్టుకుని, నంది విగ్రహాన్ని అందించాలని కోరారు.

పోలీసుల అదుపులో అనుమానితులు?
శివాలయంలోని నంది విగ్రహం చోరీ కేసులో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. అనుమానితుల్లో ముష్టికోవెలతో పాటు చెన్నంపల్లి గ్రామాలకు చెందిన వారున్నట్లు సమాచారం.