
రాజస్థాన్‌లోని కోట జేకే లాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది. డిసెంబర్‌లో నెలలో ప్రారంభమైన శిశు మరణాలు.. 102కి చేరుకున్నాయి. కేవలం గడిచిన 72 గంటల్లోనే 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపైనా, ఇటు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపైనా పలువురు విమర్శలు గుప్పించారు.
తక్కువ బరువుతో జన్మించిన శిశువులు మరణిస్తున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్ దులారా తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మరణిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రి ఆవరణలో పందులు బాగా తిరుగుతున్నట్లు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ సంఘం (ఎన్‌సీపీసీఆర్) తన విచారణ నివేదికలో పేర్కొంది. ఒక్క డిసెంబర్‌లోనే 100 మంది చిన్నారుల మరణించారు. 2019 చివరి రెండు రోజుల్లో 9 మంది చనిపోయారు. గతేడాదితో పోలిస్తే ఈ మరణాల సంఖ్య 77 అధికం. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవినాశ్ పాండేని దీనిపై నివేదిక కోరారు. సవివరంగా నివేదిక సమర్పించినట్లు పాండే తెలిపారు.
రాజకీయ దుమారం..
ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. 100 మంది చిన్నారుల మృతి తనను కలచివేసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాంగ్రెస్ నేతలైన సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ మహిళలే అయినా సాటి తల్లుల బాధ అర్థం చేసుకోకపోవడం బాధాకరమన్నారు. మాయవతి సైతం విమర్శలు గుప్పించారు. ప్రియాంక వాద్రా దీనిపై ఎందుకు మౌనం దాలుస్తున్నారని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన బిడ్డల తల్లులను పరామర్శించడం లేదు ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనపై రాజకీయాలు తగవని గహ్లోత్ హితవు పలికారు. మృతుల సంఖ్య తగ్గుతోందని, తల్లీబిడ్డల ఆరోగ్యమే తమకు ప్రథమ ప్రాధాన్యమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.