
దేశ సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలుస్తున్న ప్రాచీన కట్టడం ఎర్రకోట. అయితే రాజధాని దిల్లీలో రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో ఎర్రకోట క్రమంగా దెబ్బతింటోందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. 17వ శతాబ్దంలో షాజహాన్ చక్రవర్తి ఎర్రటి రాతితో నిర్మించిన ఈ కట్టడం గోడలపై నల్లటి కాలుష్య చారలు ఏర్పడుతున్నాయి.
భారత్-ఇటలీ దేశాల మధ్య సహకారంలో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఐఐటీ రూర్కీ, ఐఐటీ కాన్పుర్, వెనిస్‌కు చెందిన సా ఫోస్కారీ, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)లకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇందులో పాల్గొంది. కాలుష్యం కారణంగా చారిత్రక కట్టడం సౌందర్యం, నిర్మాణం దెబ్బతింటున్నాయని అధ్యయన నివేదిక తెలిపింది. ఈ బృందం ఎర్రకోటలోని వివిధ చోట్ల అంటిన నల్ల మరకల నమూనాలను సేకరించింది. కోట గోడలకు 0.05 మిల్లీమీటర్ల నుంచి 0.5 మిల్లీమీటర్ల మందంతో చారలు ఏర్పడినట్లు వెల్లడించింది.
ఈ చారలు కోట గోడ నుంచి పెళ్లలు రాలిపోయేందుకు కారణమవుతున్నాయి. గోడపై అందంగా చెక్కిన శిల్పాలకూ దీనితో ముప్పు వాటిల్లుతోంది. ఒకప్పుడు యమునా నది తీరానికి అతి సమీపంలో ఠీవిగా నిలబడిన ఎర్రకోట నేడు ట్రాఫిక్ రద్దీ మధ్య పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం కారణంగా దీన స్థితికి చేరుతోంది.





