ArticlesNews

వేదన.. శోధన.. సాధన

281views

జీవితం నిరంతరం సుఖంగా, సంతోషంగా సాగదు. లాభం-నష్టం, సుఖం-దుఃఖం… ఇలా ఒకదాన్ని వెన్నంటి ఇంకోటి ఉంటాయి. మరణం, వ్యాధి, వియోగం.. వంటి వేదన కలిగించే అంశాలకు ఎవరూ మినహాయింపు కాదు, వాటిని అనుభవించాల్సిందేనని వేదోపనిషత్తులు తేల్చి చెప్పాయి. అయితే దుఃఖాన్ని అధిగమించే ఉపాయాలకు కొదవలేదు. ఆ మార్గాలను అనుసరించగలిగితే.. దిగులు మేఘాలు కమ్మేయవు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరవచ్చని పురాణేతిహాసాల్లో పలు ఉదంతాలు చెబుతున్నాయి.

మనకు అనేక సందర్భాల్లో దుఃఖం ఎదురవుతుందని, ఆ వేదనను అనుభవించడం, దానితో జీవించడం నేర్చుకోవాలని ధార్మికవేత్తలు చెబుతుంటారు. అందుకే ‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్‌.. వేదాలలో సారమింతేనయా..’ అంటూ తేల్చారు కవి. కురుక్షేత్ర రణరంగంలో బంధుమిత్రులు మరణించడం తట్టుకోలేక దుఃఖించాడు ధర్మరాజు. అలా నిర్వేదానికి గురైన
సోదరుడిని తనదైన పద్ధతిలో ఓదార్చి కర్తవ్యాన్ని బోధించాడు భీమసేనుడు.

సీతమ్మను రావణాసురుడు అపహరించినప్పుడు.. శ్రీరాముడు తన సర్వస్వాన్నీ కోల్పోయినట్లుగా వేదన అనుభవించాడు. కానీ ఆ దుఃఖాన్ని అధిగమించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన శక్తియుక్తులకు తోడు అందరినీ కూడదీసి సీతమ్మను తీసుకురాగలిగాడు. బ్రహ్మపురాణంలో మన్మథుడు మరణించినప్పుడు.. ఆయన ధర్మపత్ని రతీదేవి పడ్డ బాధ వెలకట్టలేనిది. ప్రేమ, వియోగాలకు ఎంతటి శక్తి ఉంటుందో తెలియజేస్తుందా ఘట్టం. అప్పుడామె తపస్సు చేసి, దుఃఖాగ్ని నుంచి ఉపశమనం పొందింది. ఉపవాస దీక్ష, దానధర్మాలు వేదన నుంచి బయట
పడేస్తాయని వైశాఖపురాణంలో అంబరీష మహారాజుకు నారదమహర్షి తెలియజెప్పాడు.

అంతా బాధే..
అంతా బాధతో నిండి ఉంటే.. ‘నిస్తేజంగా బతకడం వ్యర్థం కాదా?’ వంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. బుద్ధుని బోధనలు ఆ సందేహాలను తీరుస్తాయి. సర్వం దుఃఖమయం- అనేది బౌద్ధ సూత్రాల్లో ఒకటి. ఇది భౌతిక ప్రపంచానికీ, పారమార్థిక చింతనకూ కూడా వర్తిస్తుంది. దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి మనం బుద్ధుని అష్టాంగ యోగ మార్గాన్ని అధ్యయనం చెయ్యాలి. పుట్టుక వల్ల, మరణం వల్ల, రోగం వల్ల బాధ కలుగుతుందని పేర్కొన్న గౌతముడు- కోరికలే దుఃఖానికి మూల కారణమని లోకానికి చాటిచెప్పి బుద్ధుడయ్యాడు.

భారం కాదు..
బాధ్యతలను భారంగా కాకుండా జీవితానికి అర్థం కల్పించే అవకాశాలుగా పరిగణించాలి. కర్తవ్యాన్ని నెరవేర్చడం ద్వారా ఉద్వేగం, పరధ్యానం, వేదనలకు అతీతంగా జీవించగలం. ఎదురైన కష్టం గురించి చింతకు బదులు లక్ష్య సాధన దిశగా చింతన చేస్తే నూతనోత్సాహం కలుగుతుంది. ‘కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే శతః సమాః.. నిండు నూరేళ్లూ పనులు చేస్తూనే ఉండాలి’ అంటుంది ఈశావాస్యోపనిషత్తు. నైరాశ్యానికి తావివ్వక చేయాల్సిన పనుల మీదే ధ్యాస ఉంచితే భారం తేలిపోతుందన్నది భావం.

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే

దైవ కృపతో సర్వ దుఃఖాలూ తొలగి, ప్రశాంతత లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది, భగవంతునిపై ధ్యాస నిలుస్తుంది – అన్నది భగవద్గీతలోని ఈ శ్లోక భావన. కనుక ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా భావోద్వేగాలకు లోనవకూడదు. దుఃఖానికి మూలకారణం ఏమిటో ఆలోచించాలి. మన ప్రశాంతతను భంగపరచి కలవరపెట్టే మాయలూ మోహాల నుంచి
బయటపడే మార్గం కోసం శోధించాలి.

ధ్యానంతో సాధ్యం
బాధ, అలజడులను తగ్గించి ప్రశాంత చిత్తాన్ని అందించడంలో ధ్యానాన్ని మించిన సాధనం లేదు. క్రమం తప్పకుండా సాధన చేస్తుంటే మనసు నియంత్రణలో ఉంటుంది, శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది- అని పతంజలి యోగశాస్త్రం నిరూపించింది. కనుక సమస్యలు ఉత్పన్నమైనా వాటిని పరిష్కరించుకోగలుగుతాం.

దైవభక్తి భావన దుఃఖం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రశాంతత చేకూరుస్తుంది. సంక్లిష్ట పరిస్థితుల్లో నిబ్బరాన్నిస్తుంది. తోటివారిలోనూ దైవాన్ని చూడగలగడం నేర్పిస్తుంది. ‘మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం నచ సుఖం’ అన్నాడు భర్తృహరి. కార్యసాధకులైనవారు సుఖదుఃఖాలను పరిగణనలోకి తీసుకోరన్నది ఈ శ్లోకానికి అర్థం. సంపదలు, సౌఖ్యాలపై వ్యామోహం దుఃఖ హేతువవుతుంది. వాటిపై ఆసక్తి, అనురక్తి తగ్గించుకోవటం లేదా అసలే త్యజించడం ద్వారా వేదన నుంచి విముక్తి కలుగుతుంది.

ఎంతటి వారికైనా..
వేదాంతులు చెప్పిన ప్రకారం దుఃఖానికి ఎవరూ అతీతులు కారు. అయితే ఆ బాధ పాఠాన్ని నేర్పి ఉన్నత శిఖరం చేర్చే సోపానం కావాలే గానీ దిగులు లోయలో పడేయకూడదు. దుఃఖ భారం మానసిక, శారీరక అనారోగ్యాలకు దారితీస్తుంది. పనులు కుంటుపడతాయి. బంధుమిత్రులు దూరమై ఒంటరితనం ఆవహిస్తుంది. కనుక సమస్యాత్మక సమయాల్లో ఆక్రోశించే బదులు శోధించి సాధించాలన్నదే ఆర్యోక్తి.

మనసు దుఃఖభరితమై రథం వెనుక కూలబడిన అర్జునుడి రెండు భుజాలూ పట్టుకుని లేపి, కర్తవ్యబోధ చేశాడు శ్రీకృష్ణుడు. ఆ సన్నివేశాన్ని గుర్తుచేసుకుని పరమాత్ముడు ఆసరాగా ఉంటాడని విశ్వసించి, కర్తవ్యోన్ముఖులం కావాలి. అప్పుడిక వేదన అంతరించి, విజయమే పరమలక్ష్యంగా పయనం సాగుతుంది.

ధృతరాష్ట్రుడు మనసు అలజడిగా ఉన్నప్పుడు విదురుణ్ణి పిలిపించుకునేవాడు. ఆయన చెప్పే మంచి మాటలు విని సేదతీరేవాడు. ఓ సందర్భంలో ‘పుట్టినదంతా ఒకనాటికి గతిస్తుంది. పైకి లేచిన ప్రతీది పడిపోతుంది. సేకరించినదంతా చెల్లాచెదురైపోతుంది’ అంటూ వివరించాడు విదురుడు. కనుక లోకంలో సంపద, యవ్వనం, ప్రియమైనవారి సహవాసం ఏదీ శాశ్వతం కాదు. దుఃఖం, మరణం.. ఈ రెండూ సహజ ప్రక్రియలు. లోకంలో ఏ ఒక్కరూ వాటిని తప్పించుకోలేరు. ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు దుఃఖం ఉండదు. జీవనపయనం ప్రశాంతంగా సాగుతుంది.