
ఆపరేషన్ సిందూర్ సమయంలో పెద్దఎత్తున ఫేక్ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్.. దాన్ని ఇంకా కొనసాగిస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా భారత్‌పై విషం చిమ్ముతోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని అనుకూల ఎక్స్ హ్యాండిళ్ల నుంచి ఒకేతరహా ప్రచారం చేయిస్తోంది. దీన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సమర్థంగా తిప్పికొట్టింది.
భారత ప్రధాని నరేంద్రమోదీ, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిల మధ్య చెడిందంటూ ఓ కల్పిత ప్రచారానికి పాక్ తెరతీసింది. యుద్ధ సామగ్రిని అప్‌గ్రేడ్ చేయకుండా పాక్‌తో వివాదం పెట్టుకోవడం భారత ఆర్మీకి ఏమాత్రం ఇష్టం లేదనేది ఆ పోస్టుల సారాంశం. ఒకేతరహా సందేశం వేర్వేరు అకౌంట్ల నుంచి రావడంతో పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం అప్రమత్తమైంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పౌరులకు సూచించింది.