
కంప్యూటర్లలో ఆటలు ఆడుతున్న నేటి తరం పిల్లలకు వస్త్ర పీలికలతో తయారుచేసే బొమ్మల గురించి అసలు తెలియకపోవచ్చు. 30-40 ఏళ్ల కిందటి బాల్య స్మృతులు ఉన్నవారికి మాత్రం ఈ బొమ్మలతో ఆడుకున్న ఆటలు గుర్తుండే ఉంటాయి.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గల దివంగత బత్తో బాయీ కుటుంబం నాలుగు తరాలుగా ఈ బొమ్మల తయారీని కొనసాగిస్తూనే ఉంది. దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు పుట్టిన బత్తో బాయీ గ్వాలియర్‌లోని తన మెట్టినింట అత్త ద్వారా ఈ బొమ్మల తయారీని నేర్చుకొంది.
కుటుంబ జీవనం కోసం ప్రారంభించిన ఈ చిరు పరిశ్రమ అచిర కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. భారతీయ రాజ దంపతుల పోలికతో బత్తో బాయీ రూపొందించే రాజా – రాణి బొమ్మలకు గిరాకీ పెరిగింది. ఈ ప్రతిభ దిల్లీ దాకా పాకి, 1967లో బత్తో బాయీ విజ్ఞాన్ భవన్‌లో జాతీయ అవార్డు అందుకొన్నారు.
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళల ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం ఆమెను ఎంపిక చేయడంతో ఈ బొమ్మలు జపాన్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలకు ఎగుమతి అయ్యాయి. గ్వాలియర్‌ను సందర్శించే విదేశీయులు బత్తో బాయీ బొమ్మలను ఓ జ్ఞాపకంగా తమ వెంట తీసుకువెళతారు. మధ్యప్రదేశ్‌లో అక్షయ తృతీయ నాడు మర్రిచెట్టు కింద ఈ బొమ్మల పెళ్లి చేసే సంప్రదాయం ఇప్పటికీ ఉంది.





