
కడప నగరంలో ఆవులను అపహరిస్తూ వాటిని వధించి మాంసం విక్రయిస్తున్న ఇద్దరిని చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
సీఐ ఓబులేసు వివరాల ప్రకారం.. కడప శంకరాపురానికి చెందిన కడిమల్ల చంద్రశేఖర్‌కు చెందిన ఆవును జులై 12న గుర్తు తెలియని వ్యక్తులు చంపి సగ భాగాన్ని తీసుకెళ్లారు. ఈ నెల 6న దేవుని కడపకు చెందిన మహేంద్ర అనే వ్యక్తికి చెందిన గేదెను ఇద్దరు వ్యక్తులు వధించి అవయవాలు తీసేందుకు యత్నిస్తుండగా స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితులు పరారయ్యారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆవును, గేదెను వధించిన వారు ఇద్దరూ ఒక్కటేనని తేలిందన్నారు. వాటిని వధించి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకునేవారని విచారణలో తెలిసింది. ఈ మేరకు శంకరాపురానికి చెందిన నగేష్, చెన్నూరు మండలం రామనపల్లెకు చెందిన నేలటూరు సంటిని అరెస్టు చేశారు. ఎస్సైలు రాజరాజేశ్వరరెడ్డి, రవికుమార్, సిబ్బంది శివకుమార్, వేణు, ఖాదర్‌హుస్సేన్, సుధాకర్ యాదవ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.