
భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సెనెటర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ సూచించారు. ఆస్ట్రేలియాలో కొంతకాలంగా వలసదారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆస్ట్రేలియాలో పెరుగుతోన్న జీవనవ్యయాలకు భారత వలసదారులను నిందిస్తూ సెంటర్ రైట్ లిబరల్ పార్టీకి చెందిన సెనెటర్ జసింటా ప్రిన్స్ విమర్శలు చేశారు. తమకు ఓట్లు పడేలా భారతీయ వలసదారులను రప్పిస్తున్నారని ఈసందర్భంగా ఆల్బనీస్‌కు చెందిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ పైనా ఆమె వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్ట్రేలియాకు వలస వచ్చిన భారతీయుల సంఖ్య భారీగా ఉంది. ఆ సంఖ్యను లేబర్ పార్టీకి వచ్చిన ఓటింగ్‌లో మనం చూడొచ్చు’’ అని ప్రైస్ అన్నారు.
ఈ వ్యాఖ్యలు ఆస్ట్రేలియన్-ఇండియన్ కమ్యూనిటీలో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేశారు. సొంత పార్టీ కూడా ఆమె వైఖరిని ఖండించింది. ప్రైస్ విమర్శలపై ఆల్బనీస్ స్పందించారు. ‘‘భారత కమ్యూనిటీకి చెందిన ప్రజలను ఆ వ్యాఖ్యలు బాధించాయి. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఆమె సొంత పార్టీ నేతలు కూడా అదే చెప్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.
అధికారిక లెక్కల ప్రకారం.. 2023 నాటికి భారత సంతతికి చెందిన 8,45,800 మంది ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. గత దశాబ్దకాలంతో పోలిస్తే అది రెట్టింపు సంఖ్య. ఈ నిరసనల నేపథ్యంలో కమ్యూనిటీ గ్రూపులతో న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. భారత వలసదారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇక ఈ పరిణామాలను భారత విదేశాంగ శాఖ సునిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.