
మానవుడు స్వాతంత్య్రాభిలాషి. తల్లి పట్ల ప్రేమ ఎలాంటిదో జన్మభూమి పట్ల కూడా అలాంటిదే. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని వాల్మీకి ఘంటం నుంచి మాత్రమే వెలువడడానికి కారణం ఈ నేల. తన సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, భాష-అన్నిటిపైన అభిమానం సహజం. వాటి రక్షణ కూడా తన కర్తవ్యమే.
ఒక వర్గం చరిత్రకారులకు ఓ అభిప్రాయం ఉంది. వలస పాలనలోనే భారత దేశంలో జాతీయత రూపుదిద్దుకొన్నదంటారు. నిజానికి భారతీయుల మధ్య సాంస్కృతిక ఏకరూపత, భౌగోళిక ఐక్యత ఉన్నాయి. రామాయణ, భారతాలు అసేతు హిమా చలానికి సంబంధించినవి. మధ్యలో కొంత విచ్ఛిత్తి ఏర్పడింది. మహమ్మదీయుల ఏలుబడిలో భారతీ యత బలహీనపడుతున్నప్పుడు పృథ్వీరాజ్, రాణా ప్రతాప్, శివాజీ వంటి ఎందరో జాతీయ ప్రభుత్వ స్థాపనకు పోరాడారు. కానీ ఈ జాతీయతా భావం బ్రిటిష్ కాలానికి దాదాపు అంత్య దశకు వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే భాష, తెగ, మతం ఆసరాగా చేసుకొని క్రింది స్థాయిలో జాతీయతాభావం మరింత విశాలమై సామ్రాజ్యవాద వ్యతిరేకత రూపంలో చిగురించి, మహావృక్షమైంది. ఆ వృక్షానికి శాఖలు నా దేశం, నా సంస్కృతి, నా స్వాతంత్య్రం.
1905 నాటి బెంగాల్ విభజన సామ్రాజ్యవాద వ్యతిరేక అగ్నిని రగిలించింది. జాతీయతాభావం దేశమంతటా వ్యాపించింది. బంకించంద్ర చటర్జీ ‘ఆనందమఠం’ నవలోని ‘వందేమాతరం’ 1906 కలకత్తా కాంగ్రెస్‌లో జాతీయ సమైక్యతా గీతమైంది. ఆ ఉద్యమానికి ఎందరో కవులు స్ఫూర్తినిచ్చారు. రాజమండ్రి సభలో బిపిన్ చంద్రపాల్ సమక్షంలో చిలకమర్తి ఆశువుగా, ‘భరత ఖండంబు చక్కని పాడియావు/హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ /తెల్లవారను గడుసరి గొల్లవారు /పితుకుతున్నారు మూతులు బిగియగట్టి’ అన్న పద్యం చదివారు. దేశభక్తి కవిత్వంలో అగ్రేసరుడు రాయప్రోలు, ‘ఏ దేశ మేగినా, ఎందు కాలిడిన/ ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన/ పొగడరా నీ జాతి నిండు గౌరవము/ లేదురా మన వంటి పౌరులింకెందు/అవమానమేలరా అనుమాన మేలరా/ భారతీయుడ నంచు భక్తితో పాడ’ అని రాశారు.
స్వాతంత్య్రోద్యమంలో తెలుగు ప్రాంతంలో ఇలాంటి వాతావరణం ఏర్పడింది. దీనిని మరింత తేజోమంతం చేసిన మహనీయుడు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. వారి రచన ‘ఆంధప్రశస్తి’ జాతీయవాద సాహిత్యాన్ని పరిపుష్టం చేసింది. ఆంధప్రశస్తి కావ్యంలోని 12 కవితా ఖండికలలో ఐదవదే వేంగీ క్షేత్రము. ఆంధ్రుల పూర్వ వైభవం, వేంగిని పాలించిన తెలుగు పాలకుల శౌర్య ప్రతాపా లను, చారిత్రక, సాంస్కృతిక ప్రాభవాల గురించి విశ్వనాథ రాశారు. అయితే పూర్వాంధ్రుల వైభవానికీ, నాటి యాంధ్రుల దీనస్థితికీ అంటే పారతంత్య్రానికీ గల వ్యత్యాసాన్ని తలుచుకుని దుఃఖిస్తూ ‘వేంగీ క్షేత్రము’ రాశారు.
పూర్వాంధ్ర రాజుల కథలతో నిండిన పేటిక అది. ఆ పెట్టె ఆంధ్రుల సొత్తు. ఆ పెట్టె నుండి తనకు నచ్చి, హృదయముప్పొంగ జేసిన రత్నాల వంటి గాథలను ఏరుకొనినారు. ఒకనాడు వైభవం అనుభవించిన వేంగీ క్షేత్ర చరిత్ర గాథను పద్యావళి రూపంలో మనకందించారు. ఈ రచన గురించి చల్లా రాధాకృష్ణ శర్మ ఇలా చెప్పారు. ‘‘విశ్వనాథ వారి ఆంధ్ర అభిమానానికి అక్షరాకృతియే ఆంధ్ర పౌరుషము (ఆంధప్రశస్తిలోని మరొక ఖండం). కృష్ణాగౌతమీ పెన్నా భద్రలు తెలుగు మాగాణాన్ని తడిపి, తెలుగు వారికి సిరులు సమకూరుస్తున్నట్టుగానే ఈ పౌరుష కావ్యం తెలుగుల గుండె పొరల్లో ప్రవేశించి తెలుగువారికి ఆనందోత్సాహాలు ప్రసాది స్తుందనడం సత్య సన్నిహితం.’’
ఆంధ్రులు శ్రీపర్వతీయులు, కనుక వారిపై పార్వతీదేవి కృపకు లోటు లేదని భావం. ‘‘తెలుగు జాతికి పౌరుషంబు బల దద్రి స్వామి కన్యాకృపా కలనంబుం గలదీ దృశంబుగ మహా కష్టంబులీనాటికి’’ అగస్త్య మహర్షి, వాల్మీకి మహర్షి ఆంధ్రులే అని విశ్వనాథ వారి భావన, అగస్త్యుడు వింధ్య పర్వతా హంకారాన్ని నాశనం చేసినవాడు. విశ్వనాథ• వారు ప్రధమాంధ్రస్వామిగా భావించిన అగస్త్య మహర్షి మొదలు, బొబ్బిలివీరుడు తాండ్ర పాపయ్య వరకు పూర్వాంధ్రుల పౌరుషం వివరించారు. ఈ గ్రంథాన్ని 1917లో తాను ఇంటర్ మీడియట్ చదివే రోజుల్లో రాశారు. విశ్వనాథ ఈ దేశభక్తి పద్యాలను ముద్రించి తన చిన్నతమ్ముడు రామమూర్తితో అమ్మించేవారని పెద్దలమాట. తెలుగు వారెంత గొప్పగా బ్రతికినారో వెల్లడించిన పద్యమిది.
‘‘ఒకనాడు గలదాంధ్ర యువకులు తూరుపు కనుమ దుర్గముల నేలిన దినంబు /
ఒకనాడు గలదు శిల్పకళా సరస్వతి అమరావతిని నృత్యమాడిన దినము
ఒకనాడు గలదాంధ్ర సకల ప్రపంచమ్ము కృష్ణా స్రవంతి నూగిన దినము /
ఒకనాడు గలదు నిల్వక వారు శత్రులనాంధ్ర సైన్యంబు వేటాడు దినము’’
(ఆంధ్ర పౌరుషము)
అమరావతి శిల్పకళా సరస్వతి విశ్వవిఖ్యాతి నార్జించింది. అమరావతీ స్థూపంలోని చెక్కడపు పనులు నాటి ఆంధ్ర శిల్పుల పవిత్ర మతాభి నివేశమునకు, కళా కోవిదత్వమునకు గీటురాళ్లు. నేటికి రెండు వేల సంవత్సరాల నాటి ఆచార వ్యవహారాది విషయాలను ఈ శిల్పాలు ప్రతిబింబిస్తున్నాయి.
టాలమీ తన గ్రంథంలో ‘‘మైసోలమ్’’ నుండి అత్యంత సున్నితమైన రవసెల్లాలను (సన్నటి వస్త్రం) వజ్రాలను పాశ్చాత్య సీమలకు ఎగుమతి అయ్యేవని రాశాడు. అట్టి ఆంధ్రోన్నతి కాల గమనంలో తల్లక్రిందులైంది. బండ్లపై ఓడలు కట్టవలసి వచ్చినది. సింహశార్దూలములు నక్కలతో సరిరాక పోయినవి. సజీవ నదులు కాలువలైనవి. ఈ సంద ర్భాన్ని చల్లా రాధాకృష్ణశర్మ ఇలా వ్యాఖ్యానించారు.
‘‘ఎంత గొప్పగా బ్రతికిన తెలుగువారు దురదృష్టవ శాత్తూ దుస్థితికి లోనుకావడం విశ్వనాథ వారికి దుర్భరంగా తోచింది. గత వైభవాన్ని సగర్వంగా స్మరిస్తునే, కంట తడిపెట్టారు. తెలుగువారి ఖడ్గధాటికి శత్రు వీరుల రక్తం నదులు కట్టిందని పేర్కొంటూనే ‘అస్మదున్నతి తలక్రిందులయ్యె’’ అని వాపోయారు. ‘‘మమ్మెటుల గాచెదో నీవిక నాంధ్ర మాతృకా’’ అని తమ సంశయాన్ని వెలిబుచ్చారు. అసమాన్యములైన ఆంధ్రుల శౌర్య సాహసాలు వాడిపోవడాన్ని తలుచుకుంటేనే కళ్లల్లో నీరు నిలుస్తుంది. మనస్సు వికలమవుతుంది. కంఠమేమో రుద్దమవుతుంది అని పేర్కొన్నారు. చివరకు ఆకాశం కూడా సానుభూతి వ్యక్తం చేస్తుంది. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మడం రమణీయ దృశ్యం కాదు. అలాగే పచ్చ పచ్చగా బ్రతికినవాడు ఈసురోమని కాలం గడపడం హృదయ విధారమైన దృశ్యం. సహజంగా ఆంధ్రాభిమానముగల విశ్వనాథ ఈ దృశ్యాన్ని ఊహించుకుని రంపపు కోతకు పాల్పడివుంటారు’’ (విశ్వనాథ• శారద).
నేడు తెలుగువారు ఈ స్థితికి దిగజారి పోవడానికి అంతర్వైరములే కారణమని, నేటి యాంద్రులు కూడు గుడ్డలుండిన చాలను స్థితికి వచ్చినారు. జాతీయ సత్వము చచ్చిపోయినదని నిందించాడు కవి, నేటి స్థితికి నిదర్శనమే ఈ పద్యము.
ఆంధ్ర భూదవుల కార్యాలయాంతః పుర
ప్రగతి కోతులకు నావాసమయ్యె
రాజకిరీట రారా జన్మణిచ్చటల్
ప్రతిఫలించెడి చోట్లు పాడుపడియె
పట్టపేనుగులు గర్వ సమేతముగ నేగు
కడల జిల్లేడు మొక్కలు జనించె
ఆంధ్ర పౌరుషము మాట్లాడు చోటులు శిలా
ధృతిని మార్గము నిరోధించినిలిచె
ఆంధ్ర తేజమ్ముగని మొదమంది నట్టి
యాకసము గూడ మాలిన్యమై చెలంగె
కాలమా! నీ కృతమ్ములు గలవు గద శ
తమ్ములున్ వేలు నేమి ఫలమ్ము చెప్పి (ఆంధ్ర పౌరుషము 10ప)
విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి గురించి మల్లంపల్లి శరభయ్య ఇలా అన్నారు, ‘‘చరిత్రకందిన దేశకాల ఖండములను ఆలంబనమున గొని విశ్వనాథ ప్రతిభ చరిత్రకందని దేశకాల వైభవములను శాశ్వతముగా మన కన్నుల ముందు నిలుపుచున్నది. రెండువేల సంవత్సరములకు పైబడిన కాలము నుండి యీ తెలుగు నేల నాలుగు చెరగులలో వెలసిన అనేకములైన పూర్వాంధ్ర మహా సామ్రాజ్యముల ఉదయాస్తమయ ములకు సంబంధించిన విషాదానంద శబలితమైన సంస్కృతి ధారయే ఇందలి కావ్య వస్తువు. ఆ చరిత్ర స్థలములను మహాక్షేత్రముగా సందర్శించి- అభివర్ణించి -విశ్వనాధ• ఆంధ్రజాతికెల్ల శాశ్వతముగా వానిని మహాక్షేత్రములుగా వెలయించెను. అట్టి వాటిలో వేంగీ క్షేత్రమొకటి.’
ఇది పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకు సమీప గ్రామం. నేటి ‘పెదవేగి’ ఇదే. ఒకప్పుడు ‘‘వేంగీ’’ చాళుక్యుల రాజధాని. ఇప్పటికీ వారిని ‘‘వేంగీ చాళుక్యలనే’’ పిలుస్తున్నారు. క్రీ।।శ।। 350 ప్రాంతంలో వేసిన అలహాబాద్ శాసనంలో ‘‘వేంగీ హస్తివర్మ’’ అని కనపిస్తుంది.
శాతవాహనుల తరువాత ఆంధ్రదేశ భాగములను పాలించినవారు- ఇక్ష్వాకులు, బృహత్ప లాయనులు, ఆనంద గోత్రీకులు, శాలంకాయనులు. వీరు వేంగిలో స్వతంత్ర రాజ్యం స్థాపించి పాలించారు. శాలంకాయనులు చిత్ర రథస్వామి (సూర్య భగవానుడు) పాదానుద్యాతులమని చెప్పుకొన్నారు. వీరి కులదైవం సూర్యుడు. నేటికిని పెదవేగిలో ఒక పురాతన దేవాలయమున్నది. వారు చిత్రరథస్వామి దేవాలయమని చెబుతారట. క్రీ।।శ।। 624లో రెండో పులకేశి తూర్పు తీరంపై దాడి చేసి వేంగిని గెలిచి తన తమ్ముడు విష్ణువర్ధనుని ఆ రాజ్యానికి రాజును చేశాడు. విష్ణువర్ధనుడు కీ।।శ।।631 తరువాత రాజధానిని వేంగీపురం నుండి రాజ మహేంద్ర వరానికి మార్చాడు.
ఒక చరిత్రాత్మక రాజ్యానికి రాజధానియై, మహానగరంగా విలసిల్లిన వేంగీపురమిప్పుడు కళాకాం తులు కోల్పోయి చిన్న గ్రామంగా దర్శనమిస్తున్నది. అయినా అక్కడి వైభవ చిహ్నాలు చూస్తే భావోద్వేగం కలుగుతుంది. కళ్లు చెమ్మగిల్లు తాయి. ఈ హీనస్థితి చూస్తే ఇదొకనాటి మహా నగరమంటే నమ్మరు. కాని శాసనాలు ఆ సత్యాన్ని ధ్రువపరుస్తున్నాయి.
రాజులు శౌర్యపు పాయసమ్ములు పంచి పెట్టిరి. పల్లవరాజు రమణులు కాళ్లకు పారాణి పెట్టారు. తెలుగు పిల్లలు కత్తి తిప్పారు. ఆ వేంగి రాజుల పాద చిహ్నాలను తన గర్భంలో ఇముడ్చుకొన్న ఈ భూఖండంలోనే జీవచ్ఛవాంధ్ర జనులు కన్నీరు కారుస్తారు.
తెలుగువారు చెడుగుళ్ల నాడే శత్రువులను కవ్వించడం, గూటీబిళ్ల సొగసులో రిపు శిరస్సుల బంతులాడడం, ఉప్పెన బట్టెలాటలో శత్రు వ్యూహం భేదించు నేర్పు, కోతి కొమ్మచ్చి ఆటలో కోటగోడల కెగబ్రాకుట తెలుసుకున్నారు. తెలుగు తల్లులు బొడ్డు కోయని కూనలకు కూడ ఉగ్గుపాలతో రంగరించి పోసిరట. ఇలా వేంగి గాధలను విశ్వనాథ పద్య రూపంలో ఆవిష్కరించారు.ఈ నేల చేవకు సముద్ర గుప్తుడు హడలిపోయినాడు. చిత్రరథస్వామి సేవలచే ఈ నేల పునీతమైంది. పల్లవ స్త్రీల వ్రతాల ఫలిత ముగా నిట సంపదలు నిల్చినవి. వ్రేలు గ్రుచ్చినంతనే నిధులు వెలువడు ప్రదేశము ఇప్పుడు నిరుపయోగ ముగా మిగిలినది. అది చూసి విశ్వనాథ హృదయం చలించింది. ఆయన శరీరంలో అనేక జన్మల నుండి ఆంధ్రరక్తం ప్రవహించి ఉన్నందువల్ల భారతీయ వేదాంతానికి ఆయువుపట్టు ‘‘పునర్జన్మ సిద్ధాంతము’’పై గాఢ నమ్మకం.
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం మాటలలో, ‘‘వాస్తవ జగత్తులో నుండి వాసనా మయమైన అంతర్ జగత్తు లోనికి ఆలోచనను అంతర్భవింపజేస్తున్నవీ పద్యాలు, అంతశ్చేతనమే అక్షరాకృతి తెల్పడం ఈ పద్యరచనా శిల్పము. అచ్చమైన అనుభూతికి మచ్చలేని మణిదర్పణాలీ పద్యాలు.
‘‘రమ్మణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్’’ అన్న కాళిదాసు శ్లోకంలోని రసదృష్టి ఈ పద్యాల్లో కనిపిస్తుంది. అపూర్వ భావనా బంధురమైన రచనలతో ఆలోచనామృతాన్ని వర్షించడం కంటె సున్నితమైన హృదయం స్పందనాన్ని కలిగించి తన్మయత్వం కలిగించడం కష్టం. రసార్ద్రచిత్తునికి గాని అట్టి రచనలు సాధ్యం కాదు.’’-విశ్వనాథ• కవితావైభవం.
మూలం:
1) విశ్వనాథ సత్యనారాయణ గారి భక్తి దేశభక్తి :పంపన సూర్యనారాయణ
2) ఆంధ్ర పౌరుషము చారిత్రక సాంస్కృతిక అంశాల విశ్లేషణ: డా।। మాడుగుల ప్రపుల్ల,‘ఔచిత్యం’ అంతర్జాల తెలుగు పరిశోధన పత్రిక
3) విశ్వనాథ వేంగీ క్షేత్రము : చారిత్రక విశేషాలు: డా।। పట్టపు శివకుమార్
4) ఆంధ్రులచరిత్ర – సంస్కృతి: ఖండవల్లి బాలేందుశేఖరం, ఖండవల్లి లక్ష్మీ రంజనం.
-డా. కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు



