
హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ – 1 వ భాగం ఇక్కడ చదవండి
హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 2 వ భాగం ఇక్కడ చదవండి
అనన్య ఎవరు?
ధర్మస్థల సామూహిక ఖననాల కథనానికి ఊపు, అదనపు ఆకర్షణ తెచ్చిన పేరు అనన్య. ఈ వివాదం చెలరేగి, చెన్నయ్య పోలీసు స్టేషన్‌లో, న్యాయస్థానంలో స్వైర విహారం చేస్తున్న సమయంలోనే తెర మీదకు వచ్చిన మరొక కిరాయి పాత్ర సుజాతా భట్. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమార్తె అనన్య ధర్మస్థలలోనే మాయమైందని ఆమె పోలీసు లకు ఫిర్యాదు చేసింది. ఈమె తరఫు న్యాయవాదే మంజునాథ్ ఎన్. మణిపాల్‌లో చదువుతున్న అనన్య 2003లో మిత్రులతో కలసి ఇక్కడికి వచ్చి మళ్లీ కనిపించలేదని సుజాతా భట్ చెప్పింది. అది పచ్చి అబద్ధం. 2003 నాటికి తాను సీబీఐ కోల్‌కొతా కార్యాలయంలో స్టెనోగా పనిచేసేదానినని, అప్పుడు ధర్మస్థలకు రైలు మీద వచ్చానని చెప్పింది. నాటి ఆలయ ధర్మాధికారి వద్దకు వెళ్లి అనన్య కనిపించ కుండా పోయిన సంగతి చెప్పానని, అందుకు ఆయన ఎవరితోనో లేచిపోయి ఉంటుందని అవమానకరంగా మాట్లాడారని కూడా సుజాతాభట్ కథనం. అప్పుడే తనను ముగ్గురు వ్యక్తులు వెంబడించారని, అనన్య ఆచూకీ తమకు తెలుసునంటూ తనను తీసుకువెళ్లి చేతులు కట్టేశారని, మరునాడు ‘వేకువన నీకు బతుకు మీద ఆశ ఉంటే ఈ ఊరి నుంచి వెంటనే వెళ్లి పోవాల’ని ఆదేశించారని కూడా చెప్పింది. అందుకు తాను నిరాకరించడంతో తల మీద కొట్టారని, ఆ దెబ్బతో కోమాలోకి వెళ్లపోయిన తాను మూడు మాసాల తరువాత మేలుకొన్నానని చెప్పింది. తీరా మంగళూరులోని తమ ఇంటి వచ్చి చూస్తే అంతా చిందరవందరగా ఉందని, పత్రాలు, ఫోటోలు అన్నీ పట్టుకుపోయారని అందుకే అనన్య ఫోటో ఇవ్వలేకపోయానని చెప్పింది. కానీ సుజాత చెప్పిన సంవత్సరాలలో మణిపాల్ వైద్య కళాశాలలో అనన్య అనే అమ్మాయి ఎవరూ చదవలేదని యాజమాన్యం తెలియచేసింది. కేసు బట్టబయలయిన తరువాత అసలు అనన్య భట్ అనే యువతి లేనేలేదని సుజాతా భట్ ఒక యూట్యూబర్ దగ్గర నోరు జారారు. కొందరి బలవంతం వల్లనే తాను ఆ అబద్ధం చెప్పానని కూడా అంగీకరించారు. వీరిలో సుజాతా భట్ ఆడిన నాటకం మామూలుది కాదు. ఈమెకు అసలు కూతురే లేదు. ఇంతకీ ధర్మస్థల మీద ఈవిడకు వ్యక్తిగత కక్ష ఎందుకట! కథో, వాస్తవమో తరువాత తెలుస్తుంది. అదేమిటో చూద్దాం! ఈమె తాతగారు తన ఆస్తిని ధర్మస్థల దేవస్థానానికి అమ్మేశారు. అందులో తనను వాటాదారుగా చేర్చడానికి ఆలయ యాజమాన్యం అంగీకరించలేదు. అప్పటి నుంచి ఆమె ఆలయం మీద కక్ష పెంచు కుంది. అబద్ధాల మధ్య ఇంకొ అబద్ధం కూడా చెప్పిందీమె. ఒక హిందూ దేవాలయ యాజమాన్యం జైనుల అధీనంలో ఉండడం ఆమెకు బాధగా ఉందట. అంతిమంగా అనన్య గురించి తాను చెప్పిన దంతా అబద్ధమేనని ఒప్పుకుంది. తన కుమార్తెగా చెప్పిన అనన్య తప్పిపోయిందంటూ ఈ జూలై 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లేని అనన్య తప్పిపోయినది 2003లో. ఫిర్యాదును అప్పుడు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చింది. ఈ అబద్ధం ఆడితే గుడి నుంచి తన ఆస్తి తనకు అప్పగించేటట్టు చేస్తామని సామాజిక కార్యకర్తలు ఆశ పెడితేనే తాను అబద్ధం ఆడానని సుజాతా భట్ బయటపెట్టింది. గిరీశ్ మట్టన్నావర్, టి.జయంతి అనే వారు చెప్పమన్నట్టే సుజాతా భట్ చెప్పింది. ఇదంతా నేను డబ్బు కోసమైతే చేయలేదు. కాబట్టి యావత్ దేశం నన్ను క్షమించాలని కూడా కోరింది.
నాలుగు దశాబ్దాల కుట్ర
ధర్మస్థల మీద, ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్గడ మీద బురద జల్లే కార్యక్రమం ఈనాటిది కాదు. చెన్నయ్య ద్వారా ఈ భారీ కుట్రకు అనుకోకుండా ముగింపు తప్పలేదు. కానీ దీని వెనుక హిందూ హక్కుల నాయకునిగా చెలామణి అవుతున్న మహేశ్‌శెట్టి తిమరోడితో పాటు అర్బన్ నక్సల్స్ కూడా ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ కుట్ర సాగుతోంది. ఈ కుట్ర వెనుక లక్ష్యం ఎవరంటే- రాష్ట్రంలోనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు. ధర్మస్థల ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వీరేంద్ర హెగ్గడ. ఆయన బీజేపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేవస్థానంలో ప్రధాన పాలనాధికారి లేదా ధర్మాధికారి హోదాలో ఉన్నారు. ధర్మస్థల కేవలం ఆధ్యాత్మిక కేంద్రం కాదు. ప్రజానీకానికి విద్య, వైద్యం ఇతర సహాయాలు అందిస్తున్న సామాజిక సేవాకేంద్రం కూడా.
శ్రీక్షేత్ర ధర్మస్థల ఆధ్వర్యంలో 30 విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో పది ఉన్నత పాఠశాలలు. రెండు ప్రీయూనివర్సిటీ సంస్థలు. ఒక న్యాయశాస్త్ర కళాశాల. ఆరు వైద్య విద్యాసంస్థలు. మూడు మేనేజ్‌మెంట్ కళాశాలలు. ఐదు సాంకేతిక విద్యా కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ శ్రీధర్మస్థల మంజునాథేశ్వర పేరుతోనే ఉంటాయి. ఆయుర్వేదం, ఫిజియోథెరపీ, యోగ, డెంటల్ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం 15,000 మంది భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందుతుంది. రెండు పూటలా ఉచిత ప్రసాదం స్వీకరించవచ్చు.
ఇదంతా అక్కడి క్రైస్తవ సంస్థలకు, కమ్యూ నిస్టులకు, నక్సల్ అభిమానులకు కన్నెర్ర అయింది. ఆనాటి ప్రయత్నంలోను ఈ ముఠా ఓడిపోయింది. ధర్మస్థలలో అబలలు మరణిస్తున్నారంటూ గతంలో బాగా అల్లరి చేస్తూ, అందుకు వీరేంద్ర హెగ్గడను బాధ్యులను చేయడానికి చూశారు. వారిమీద నోటికి వచ్చినట్టు పేలవద్దని సుప్రీంకోర్టు 2022లోనే సోమనాథ్ నాయక్ అనేవాడికి గడ్డి పెట్టింది. ఇతడు నాగరిక సేవా ట్రస్ట్ పేరుతో ధర్మస్థల దేవస్థానానికి పోటీ సేవ ప్రారంభించాడు. అంతకు ముందు బ్తెంగడి న్యాయస్థానం నాయక్, మరో ఐదుగురిని కూడా ఇదే విధంగా హెచ్చరించింది. అయితే న్యాయస్థానాలను వాడుకోవడమే కానీ, గౌరవించే సంస్కృతి తెలియని ఈ అర్బన్ నక్సల్స్ సామాజిక మాధ్యమాలలో వీరేంద్ర హెగ్గడ మీద అవాకులూ చెవాకులూ ఆపలేదు. దీనితో బెల్తంగడి న్యాయస్థానం నాయక్‌కు మూడు నెలలు జైలు శిక్ష, రూ. 4.5 జరిమానా కూడా విధించింది. దీనిని సుప్రీంకోర్టు సమర్ధించింది. సౌజన్య అనే యువతి హత్య (అక్టోబర్ 9, 2012)లో ధర్మస్థల నిర్వాహకుల కుటుంబం ప్రమేయం ఉందని మహేశ్ శెట్టి తిమరోడి ఆరోపిం చడం కూడా ఇలాంటిదే. సౌజన్య ఉదంతం మీద మహమ్మద్ సమీర్ విడుదల చేసిన వీడియో కూడా నాడు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో గిరీశ్ మట్టన్నవార్ అనే మరొక సామాజిక కార్యకర్త సమీర్‌కు వత్తాసు పలికాడు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు కూడా వెనక్కి వెళ్లిపోయారు. గిరీశ్ మట్టన్నవార్ గతంలో పోలీసుశాఖలో పని చేసి సస్పెండయ్యాడు.
దిశ మారిన దర్యాప్తు
ధర్మస్థల ప్రతిష్టను మంట గలిపేందుకే ఇలాంటి భారీ కుట్ర చేశారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా శాసనసభలో వెల్లడించడం విశేషం. ఇదంతా ఒక కుట్రగానే కనిపిస్తున్నది. అందుకే సిట్ కూడా తన దర్యాప్తు దిశను మార్చు కుంది. కుట్ర సిద్ధాంతం ఆధారంగా దర్యాప్తును కొనసాగించే ప్రయత్నాలలో ఉంది. ధర్మస్థల దేవ స్థానానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఐదుగురుని దృష్టిలో ఉంచుకుంటే కుట్ర సిద్ధాంతమే నిజమని అనిపిస్తుంది. ఇందులో మొదటివాడు ముసుగు మనిషి లేదా చెన్నయ్య. మరొకడు మహేశ్ శెట్టి తిమరోడి, ఇంకొకడు యూట్యూబర్ మహ్మద్ సమీర్, సామాజిక కార్యకర్త గిరీశ్ మట్టన్నావర్ కనిపిస్తారు. చివరిగా వచ్చేది సుజాతా భట్. ఒక బృందం ఆడమన్నట్టే తాను అంతా ఆడానని అరెస్టయిన ఆగస్ట్ 23న పోలీసుల ఎదుట చెన్నయ్య అంగీకరించాడు. సుజాతా భట్ చెప్పింది కూడా ఇదే. యూట్యూబర్ చెప్పమన్నట్టే చెప్పానని అన్నారు. అంటే సమీర్ అడమన్నట్టు ఆడారు. చెన్నయ్య ఒక సంవత్సన్నర కాలంగా ధర్మస్థలకు సమీపంగా ఉండే ఉజిరే పట్టణానికి తరుచు వచ్చి వెళ్లినట్టు తెలిసింది. ఉజిరే పట్టణ పారిశుద్ధ్య సిబ్బందిలో ఒకడైన తానోసిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ముసుగు మనిషికి తమ్ముడే. ఇక మహేశ్ శెట్టిని 20వ తేదీన బ్రహ్మవర పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇతడికి ఉడిపి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సామాజిక కార్యకర్తగా మారిన మాజీ పోలీసు ఉద్యోగి గిరీశ్ మట్టన్నావర్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఇంతకీ ఇంత పెద్ద కుట్ర పన్నిన యూట్యూబర్ సమీర్ గురించి గాలిస్తున్నారు. ఇతడికి మంగళూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆపై ఆచూకీ లేడు.
సామూహిక ఖననం అంటూ వచ్చిన ఆరోపణ లన్నీ నిరాధారమని తేలిందని, కేవలం హిందూ పవిత్ర క్షేత్రాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఇంత కుట్ర పన్నారని వీరేంద్ర హెగ్గడ వ్యాఖ్యానించారు. ఇంతవరకు 17 చోట్ల తవ్వారని ఏమీ దొరకలేదని ఆయన తెలియచేశారు. హిందువులు మరింత జాగరూకతతో ఉండాలని, మన ధర్మాన్ని మనం మరింత జాగ్రత్తగా రక్షించుకోవడం అవసరమని ఆయన అన్నారు. ఒక పథకం ప్రకారం జరుగుతున్న ఇలాంటి దుష్ప్రచారం మీద ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేయించాలని మాజీ ఎమ్మెల్యే అశోక్ కటావే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ధర్మస్థల అంటే మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చింతనకు కేంద్రమని ఆయన అన్నారు. హిందూత్వను అపఖ్యాతి పాలు చేయడానికే కాంగ్రెస్ ఇదంతా సాగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. ఇవాళ ధర్మస్థల దగ్గర చేశారు. రేపు మరొక హిందూ దేవాలయం వద్ద కూడా ఇదే తంతు నడిపిస్తారని ఆయన విమర్శించారు. దీనికి కమ్యూనిస్టుల సాయం కూడా ఉందని అన్నారాయన. ఈ వివాదాన్ని తెర మీదకు తెచ్చిన చెన్నయ్య (ముసుగు మనిషి), మరొక నాటకం ఆడిన సుజాతా భట్ ఇద్దరూ డబ్బులకు ఆశపడి, ఎవరివో ఆదేశాలతో ఇదంతా చేశారని బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి ఆరోపించారు. చెన్నయ్యకు నార్కో అనాలిస్ చేయించాలని పోలీసులు భావిస్తుం డగా, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం కూడా కొన్ని అనుమానాలకు దారి తీసేదని ఆయన అన్నారు. కాగా, ఈ పరిణామం నుంచి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నదని రాష్ట్ర కాంగ్రెస్ ఎదురు ఆరోపణ చేసింది.
కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో హిందూధర్మం దయనీయ పరిస్థితులలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. తమిళనాడులో డీఎంకే ఉంది. ఆంధప్రదేశ్, తెలంగాణలలో ప్రాంతీయ పార్టీలు కూడా హిందూ ధర్మం మీద దాడి పట్ల ప్రేక్షక పాత్ర మాత్రమే వహించాయి. ఇప్పటికైనా హిందువులు మేల్కొనడం అవసరం. ధర్మస్థలలో జరిగినది కేవలం ఒక గొప్ప హిందూ పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నమే. ఒక యూట్యూబర్. ఒక పారిశుద్ధ్య కార్మికుడు, ఒక మహిళ కలసి ప్రదర్శించిన ఈ తమాషా అత్యంత హేయం. హిందువులు ఇకనైనా కళ్లు తెరుస్తారా? ఉదారవాదం పేరుతో, సెక్యులరిజం పేరుతో మన ధర్మానికి జరుగుతున్న ఘోర అవమానాలను నిలువరించాలన్న ఆలోచనకు రాగలరా? కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వైఎస్‌ఆర్‌సీపీ, బీఆర్‌ఎస్, డీఎంకే వంటి పార్టీలు భారతీయతకు ఎంత అన్యాయం చేస్తు న్నాయో గమనించాలి. ధర్మస్థల పరిణామాలు హిందువులకు కనువిప్పు కలిగించాలి. హిందువులను దొంగలని, హిందూధర్మం కరోనా, డెంగ్యూ వంటిదని విమర్శిస్తున్నా హిందువులు మేల్కొనకపోవడం నిజంగా విడ్డూరం. యూట్యూబర్ల పేరుతో, సెక్యులరిస్టులు, స్టాండప్ కమేడియన్‌ల పేరుతో నిరంతరం మన ధర్మాన్ని అవహేళన చేస్తున్నా మనకు చీమ కుట్టినట్టయినా లేదెందుకు?





