
( సెప్టెంబర్ 4 – వామన జయంతి )
వామన-బలి ఘట్టంలో పౌరాణిక అంశాలతో పాటు వ్యక్విత్వ వికాస పాఠమూ ఇమిడి ఉంది. త్రిలోకాధిపత్యం కోసం ఇంద్రుడిని ఓడించి అడవుల పాలుచేసిన బలిని దండించేందుకు దేవదేవుడు వామన రూపంలోనే రానవసరం లేదు. ధర్మం నశించి, అధర్మం పెచ్చరిల్లినప్పుడు దుష్టశిక్షణ,శిష్ట రక్షణ కోసం తననే తాను సృజించుకుంటానన్నాడు భగవానుడు. బలి విషయంలో ‘దుష్టశిక్షణ’ అనేది నప్పదు. ఆతని అహంకారాన్ని అణచి అనుగ్రహించడం, బలితో పాటు భవిష్యత్ మానవాళికి తత్వాన్ని బోధించడమే ఈ అవతార పరమార్థంగా భావించాలి. దీనిని కేవలం కథలా చూస్తే … ‘ఉన్నదానితోనే సంతృప్తిచెందాలి.. అవసరం మేరకే అర్థించి స్వీకరించాలి తప్ప వారి వద్ద ఉన్నది దోచుకోవాలన్న దుర్భిద్ధి కూడదు… ధర్మానికి కట్టుబడి ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలి’ లాంటి అమూల్య సందేశాన్ని ఆస్వాదించగలం.
బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం ద్వారా ఇంద్రుడిని జయించి త్రిలోకాధిపత్యం కైవసం చేసుకొని అధికారదర్పం ప్రదర్శిస్తున్న వేళ దేవగణం కలవర పడింది. మాతృశ్రీ అదితికి మొరపెట్టుకుంది. వారిని ఆదుకునేందుకు, శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేసుకొనేందుకు భర్త కశ్యపుడి సూచనపై పయోవ్రతం ఆచరించింది. ఫలితంగా, శ్రీహరి భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రంలో అభిజిన్ముహూర్తంలో కశ్యప అదితి దంపతులకు వరపుత్రుడిగా ఉదయించాడు. ఆ రోజును వామన ద్వాదశి, బలి ద్వాదశి, దివ్య ద్వాదశి, విజయ ద్వాదశి, మహాద్వాదశి అని వ్యవహరిస్తారు.
బలి అశ్వమేథ యాగం చేస్తున్న నర్మద నదీ తీరంలోని ‘భృగుకచ్ఛం’ చేరాడు వామనమూర్తి. బలిని సమీపిస్తూనే, ‘స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు…’ అని ఆశీర్వదించాడు. దానవేంద్రుడు అమితా నందంతో వటువును సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. పాదజలాన్ని శిరస్సున చల్లుకున్నాడు.
బలి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడి మనవడు. ఉత్తముడు, సత్యసంధుడు, అమిత శౌర్యపరాక్రమశాలి. ఆయన పాలన సుభిక్షమైనదని, సకాలంలో వానలు కురిసి ధనధాన్యాదులు సమృద్ధిగా ఉండేవని, అన్ని వర్గాల వారు సుఖశాంతులతో జీవించేవారని భాగవతం చెబుతోంది. కానీ అతను అహంకారాన్ని మాత్రం వీడలేకపోయాడు. తన జపతపాలకు మూడడుగుల భూమి చాలునన్న వామనుడి కోరికకు విస్తుపోయి, ‘మడులు, మణులు, మాణిక్యాలు, రాజ్యం..ఇలా ఏదైనా, ఎంతైనా ఇవ్వగల నా దగ్గర ఇంత అ(స్వ)ల్ప కోరికా? గ్రహీత… దాత స్థాయినైనా పరిగణించాలి కదా?’ అనడంలో దర్పం ధ్వనించింది. ‘దాత ఎంతో ఇవ్వగలిగినా గ్రహీత అవసరం మేరకే స్వీకరించాలి. మనిషికి తృప్తి ప్రధానం. దానికి మించిన సంపదలేదు. ప్రాప్తం కొద్దీ దక్కిన దానితో తృప్తిపడని వారు ఏడు ద్వీపాలలోని భూమిని ఇచ్చినా (‘ప్రాప్తంబగు లేశమైన బదివేలనుచున్‌ఁ దృప్తిం జెందని మనుజుడు సప్త ద్వీపములనైనన్‌ఁజక్కంబడునే’…) అదే పరిస్థితి. నా కోరిక నీ దృష్టిలో అల్పం.. మేరు పర్వతం లాంటి నీ ముందు పరమాణవు కావచ్చు నాకు అది అనల్పం, అనంత సంపద’ అని బదులిచ్చాడు.
వామన-బలి సంభాషణను ఆలకిస్తున్న రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆ వటువును హరిగా గ్రహించి, దాన పక్రియకు అభ్యంతరం తెలిపాడు. బలి వెనుకాడలేదు. ‘దాతగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం (‘తిరుగన్ నేరదు నాదు జిహ్వ), ఆత్మాభిమానం కలవారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఆఖరికి ప్రాణం పోయినా ఆడినమాట తప్పకపోవడం (‘బ్రతుకవచ్చుఁగాక బహు బంధనములైన/ వచ్చుగాక లేమి వచ్చుఁగాక/జీవధనములైనఁ. జెడుగాక పడుగాక/మాటఁదిరుగలేరు మానధనులు’) ఒక కారణమైతే సాక్షాత్తు శ్రీకాంతుడి చేయి కిందయి, నా చేయి మీదవడం గర్వకారణం కాదా?’ అని ప్రశ్నిస్తాడు. ఎందరో రాజులు, చక్రవర్తులు పుట్టిగిట్టారు కానీ యశస్సును తప్ప భౌతిక సంపదలను వెంట తీసుకువెళ్లలేదు కదా? (కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోతిన్ పొందరే….’ అని) అనీ వాదించి, వారించాడు. గురువు శపించినా విచారించలేదు. మూడు అడుగులు ధారపోసే క్రమంలో త్రివిక్రముడి పాద ఘట్టంతో సుతల లోకానికి చేరాడు.
ఈ సంవాదంలో మానవాళికి ఉపకరించే ఎన్నో అంశాలు బోధ పడతాయి. ముఖ్యంగా అశాశ్వతమైన జీవితంలో అనంత సంపద కోసం వెంపర్లాట తగదనే హితవు దాగి ఉంది. సంపద, అధికారం శాశ్వతమని అహంకరిస్తే పతనం తప్పదు. కోరికలు అనంతం. తీరినకొద్దీ పుడుతూనే ఉంటాయి.ఎన్ని సద్గుణాలు ఉన్నా అహం ఏ రూపంలోనూ తగదనేందుకు బలిమర్దనమే ఉదాహరణ. గర్వం, అహం నశించిన వారికి జ్ఞానం కలుగుతుందని ఈ ఉదంతం చెబుతోంది. దానధర్మాలు చేస్తూనే అనుచిత కార్యాలకు పాల్పడడం సరికాదన్నది. ‘అడిగినవన్నీ ఇవ్వగలను అనుకోవడం అజ్ఞానమైనట్లే, అవస రమైనంత వరకే స్వీకరించడం జ్జానం..’ అనేది వామనావతార ఘట్టం పరమార్థం.
మనుషులు ఎంత ధర్మవర్తనులైనా పదవీ, ఐశ్వర్యాల విషయంలో వారి పట్ల దేవదేవుడి ఆలోచన మరోలా ఉంటుంది. ‘అనేకులు సంపద్గర్వంతో లోకాన్ని లక్ష్యపెట్టరు. ఆ గర్వం అంతరిస్తే మనసు స్థిరంగా ఉంటుంది. అందుకే నేను అనుగ్రహించ దలచిన వారి సంపదను ముందుగా హరించి వేస్తాను.అయినా స్థిరచిత్తులే ఉత్తములు. అలాంటి వారిలో బలి శ్రేష్ఠుడు. రానున్న సావర్ణి మన్వంత రంలో ఇంద్రపదవి అధిష్ఠించ గలడు. అంతవరకు విశ్వకర్మ నిర్మిత సుతల లోకం సకల శుభశాంతులతో నివాసంగా ఉంటుంది’ అని త్రివిక్రమూర్తి అనుగ్ర హించాడు.





