News

పాఠశాలలో ఉపాధ్యాయుల క్రైస్తవ మత ప్రచారం.. కేసులు నమోదు

204views

మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు జరుగుతుండటంపై హిందూ సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి.

గ్వాలియర్ జిల్లా, దాబ్రా పట్టణంలోని జంగిపురాలోని నవ కాంతి అనే పాఠశాలలో ఉపాధ్యాయులు యేసు క్రీస్తు గురించి విద్యార్థులకు బోధిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులను, కుటుంబాలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు కూడా ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది.

విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం, 2021లోని సెక్షన్ 5 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో శ్యాం నారాయణన్, రేవికా నందా, డెంజిల్ అనే వ్యక్తుల పేర్లను చేర్చారు. ఈ ముగ్గురు కూడా క్రైస్తవ మతాన్ని పాఠశాలలో ప్రచారం చేస్తున్నారని, క్రైస్తవాన్ని తెగ పొగుడుతూ ప్రసంగాలిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్తుల తల్లిదండ్రులకు ఉద్యోగాలిస్తామని, ఆర్తిక ప్రోత్సాహకాలిస్తామని కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇక… ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘మేము, మా స్నేహితులం కలిసి పాఠశాలలో ఏం జరుగుతుందో చూడటానికి వెళ్లాం. అక్కడ క్రైస్తవ మత ప్రచారం జరుగుతున్న విషయాన్ని స్వయంగా చూశాం. అంతేకాకుండా ఉపాధ్యాయులు మా దగ్గరికి కూడా వచ్చి బైబిల్ ఇచ్చారు. క్రైస్తవంలోకి వస్తే డబ్బులిస్తామని, ఉద్యోగం కూడా ఇస్తామని మమ్మల్ని ప్రలోభం పెట్టారు.’’ అని తల్లిదండ్రులు వెల్లడించారు.

దీంతో వెంటనే తల్లిదండ్రులు విద్యాధికారికి, హిందూ సంఘాలకు దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో విద్యాధికారులు, విశ్వహిందూ, బజరంగ్ దళ్ నేతలు అక్కడికి చేరుకున్నారు. హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వెంటనే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో వైపు విద్యాధికారులు ఆ పాఠశాల నుంచి క్రైస్తవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకొని, పాఠశాలను సీజ్ చేశారు.