
మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచ ప్రసిద్ధి ఉంది. తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠతో హిందువులు పూజలు చేస్తారు. పూర్తిగా హిందూ తాత్త్వికతతో కూడిన దేవతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలతో కొలుస్తారు. ఈ సంవత్సరం మైసూరు దసరా ఉత్సవాలను ప్రముఖ కన్నడ రచయిత్రి, బుకర్ బహుమతి గ్రహీత బాను ముస్తాక్ ప్రారంభిస్తారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎడెయ హనతెగె (హృదయ దీపం) అన్న కథా సంకలనంతో ఆమె బుకర్ గెలుచుకున్నారు. అందుకు ఆమెను తప్పక అభినందించాలి. ఆ పురస్కారం గెలుచుకోవడం ఆమెకే కాదు, కన్నడ సాహిత్య రంగానికే గౌరవం కూడా. కానీ ఆమె మత విశ్వాసం వేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, అందునా కర్ణాటక రాష్ట్ర సామాజిక వాతావరణం, ప్రభుత్వ వైఖరిని బట్టి ఆమెను ఆహ్వానించాలన్న నిర్ణయం క్షణాలలోనే వివాదాస్పదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన సామాజిక మాధ్యమాలను మోత మోగించింది. మైసూరు దసరా ఉత్సవాలను (నాడ హబ్బ) ప్రారంభించాలని కోరుతూ బాను ముస్తాక్‌ను లాంఛనంగా ఆహ్వానించాం అన్నది ఆ ప్రకటన సారాంశం. అయితే, ఒక ప్రపంచ ప్రఖ్యాత హిందూ ఉత్సవాలను ఒక ముస్లిం మహిళ చేత ప్రారంభింప చేసి, ప్రపంచ ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నది?
బాను ప్రగతిశీల భావాలున్న రచయిత్రి అని, కర్ణాటకలో జరిగిన ఉద్యమాలతో, రైతాంగ, దళిత ఉద్యమాలతో మమేకమైన వారని, ఆమె సేవలకు గుర్తింపుగా మైసూరు ఉత్సవాలలో పెద్దపీట వేసి గౌరవించే అవకాశం వచ్చినందుకు ప్రభుత్వం గర్విస్తున్నదని కూడా సిద్ధరామయ్య పరవశంతో వ్యాఖ్యానించారు. ఇలాంటి బుజ్జగింపు ధోరణిని చూసి, మాటలు విని మోసపోయే స్థితిలో ఇప్పుడు హిందువులు లేరు. అందుకే వెను వెంటనే నిరసన ప్రారంభమైంది. ఈ ఉత్సవానికి ముస్లిం బానును ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టిన ఇద్దరి మీద అప్పుడే కేసులు కూడా నమోదయ్యాయి. అసలు ఇంత మంచి నిర్ణయం తీసుకుంటే దీనిని వ్యతిరేకించడం ఏ మాత్రం సరైనది కాదంటూ హోంమంత్రి జి. పరమేశ్వరన్ హితవు చెబుతున్నారు. మరొక మంత్రి హెచ్‌కే పాటిల్ అయితే దసరా అంటే అందరి కోసం ప్రభుత్వం నిర్వహించే ఉత్సవమన్నాడు. ఇందులో అసలు రాజకీయమే లేదట. దీనిని బీజేపీ వ్యతిరేకించక తప్పదు. అదే చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యది టిప్పు సుల్తాన్ మనస్తత్వమని, హిందూధర్మాన్ని భ్రష్టు పట్టించడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే అశోక విమర్శించారు.
ఈ ఉత్సవాలలో కీలకంగా ఉండే మైసూరు వడయార్ వంశీకుడు, బీజేపీ ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ చాలా హుందాగా ఒక వ్యాఖ్య చేశారు. ఆ ఉత్సవాలు మైసూరులోనే ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమవుతాయి. ఆ అమ్మవారి ప్రతిమన కనుక గౌరవిస్తే బాను ముస్తాక్ ఉత్సవాలను ప్రారంభించడానికి నాకు అభ్యంతరం లేదని అన్నారాయన. హిందూ పురాణాలు, గ్రంథాలు ఈ ఉత్సవం గురించి ప్రస్తావిస్తాయి. వాటి వారసత్వం ఇందులో ఉంది. కాబట్టి బాను మొదట భువనేశ్వరి, చాముండేశ్వరి అమ్మవార్ల పట్ల గౌరవం ప్రదర్శించి, అప్పుడు ఉత్సవాలు ప్రారంభించాలని ఆయన సూచించారు. మాజీ ఎంపీ (బీజేపీ) ప్రతాపసింహ బాను అఖిల భారత సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించడం సబబు కాని, దసరా ఉత్సవాలు కాదని అన్నారు. ఆఖరికి మైసూరు ఉత్సవాలలో సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేసి, దానిని ఆమె చేత ప్రారంభింప చేసినా అభ్యంతరం లేదని కొందరు చెబుతున్నారు. ఇదంతా బీజేపీ అభ్యంతరం మాత్రమే అనుకునేవారు అర్ధం చేసుకోవాల్సిన అంశం- బీజేపీ బహిష్కృతులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. బాను మాత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన అపూర్వ అవకాశమని బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు.
వీరంతా వ్యక్తిగతంగా, రచయితగా బానును వ్యతిరేకించడం లేదు. హిందూ సంప్రదాయాన్ని బుజ్జగింపు ధోరణితో కాంగ్రెస్ ఉల్లంఘించడం గురించే ప్రశ్నిస్తున్నారు. మైసూరు దసరా ఉత్సవాలు చాముండేశ్వరి పూజతో మొదలవు తాయి. కానీ ముస్లిం వర్గం నుంచి వచ్చిన బానుకు ఆ అమ్మవారి మీద విశ్వాసం ఉందా? అన్నది కూడా ప్రశ్న. అలాగే అమ్మవారిని పూజించడానికి పాటించే ఆచార వ్యవహారాలను ఆమె గౌరవిస్తారా? ఇదొక ప్రశ్న. అలాగే అమ్మవారి దగ్గర దీపం వెలిగించాలి. అది బాను స్వమతానికి వ్యతిరేకం కదా అనేవారు కూడా తక్కువేమీ కాదు. ఒకే దైవం, ఒకే పవితగ్రంథం అన్న పాత విశ్వాసాన్ని ఆమె ఆపై కూడా కొనసాగిస్తారా అన్న ప్రశ్న కూడా ఉంది. దసరా సంబరాల వద్ద బాను ప్రవేశాన్ని ఎవరూ నిరాకరించడం లేదు. వాటిని ప్రారంభించడం గురించే వివాదమంతా.
హిందువులు, ముస్లింల పట్ల ఒక నిరంతర సంఘర్షణను కొనసాగించడమే తమ విజయానికి దోహదం చేస్తుందని సిద్ధరామయ్య మొదటి నుంచి నమ్ముతు న్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధానమే ఇది. టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాన్ని అలాగే ప్రవేశపెట్టారు. దీనిని బీజేపీ, హిందువులు వ్యతిరేకించ వలసి వచ్చింది. టిప్పు సుల్తాన్ ముమ్మాటికి హిందూ ద్రోహి. మేల్కోటే గ్రామంలో అతడు చేసిన ఘాతుకం చరిత్ర మరచిపోదు. పతన దశకు చేరుకున్న తరువాత హిందూ దేవతామూర్తుల బొమ్మలతో నాణేలు ముద్రించాడు. అది అతడి వాస్తవిక చిత్రం కాదు. అలాంటి టిప్పు భజన ద్వారా ఓట్లు దండుకుంటున్న పార్టీ కాంగ్రెస్. తరువాత వక్ఫ్ బోర్డులకు హద్దులు లేని అధికారాలు ఇచ్చి, తరువాత నాలుక్కరుచుకుంది. బానును మరొక విధంగా తప్పక గౌరవించుకుందాం.ప్రస్తుత నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం మార్చుకోవడమే మేలు.





