
మత, భాషాపరమైన మైనారిటీలకు సంబంధించిన పాఠశాలల్ని విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) పరిధి నుంచి మినహాయిస్తూ సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పు సహేతుకమైనదేనా అన్న ప్రశ్నను అదే కోర్టు లేవనెత్తింది. ఈ విషయంపై విచారణను మరింత విస్తృత ధర్మాసనానికి నివేదించింది. జాతీయ బాలహక్కుల పరిరక్షణ కమిషన్ నివేదికతో పాటు ఈ అంశానికి సంబంధించిన పలు విషయాలు తమ పరిశీలనకు వచ్చాయని, ఆ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్‌మోహన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘ప్రమతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్టు కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సార్వజనిక ప్రాథమిక విద్య అందించాలన్న సమాచార హక్కు చట్ట లక్ష్యానికి అనుకోకుండా విఘాతం కలిగించి ఉండవచ్చా అని వినమ్రంగా ప్రశ్నించదలిచాం’’ అని ధర్మాసనం పేర్కొంది.
మైనారిటీ విద్యా సంస్థల్ని విద్యాహక్కు చట్టం నుంచి మినహాయించడం ఏకరూప పాఠశాల విద్య ఉండాలన్న లక్ష్యాన్ని దెబ్బతీసేలా ఉందని, సమాజంలోని అందరినీ కలుపుకొని ముందుకు సాగాలన్న 21ఏ రాజ్యాంగ అధిరణ స్పూర్తికి భంగకరంగా ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. బడిపిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు, సుశిక్షితులైన ఉపాధ్యాయులు, పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం కల్పించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఆర్టీఈ పరిధి నుంచి మినహాయించిన కారణంగా మైనారిటీ విద్యాసంస్థలు ఈ సదుపాయాలన్నీ కల్పించి తీరాలన్న నిర్బంధమేదీ లేకుండా పోయిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అంశంపై లోతైన విచారణ జరిపేందుకు కోర్టు తాజాగా నాలుగు ప్రశ్నల్ని మరింత విస్తృత ధర్మాసనానికి నివేదించింది.





