
పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో భాగంగా ప్రభుత్వ ఆస్తి ధ్వంసానికి కారకులైన వారిపై చర్యలకు యూపీ సర్కార్ సిద్ధమైంది. రాంపూర్‌లో జరిగిన హింసాత్మక నిరసనల్లో ఆస్తి నష్టానికి కారకులైన 28 మందిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. గత శనివారం యూపీలోని రాంపూర్‌లో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. కొందరు నిరసనకారులు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడంతో పాటు నాలుగు ద్విచక్రవాహనాలకూ నిప్పంటించారు. అనంతరం పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు.

ఈ హింసాత్మక ఘటనల్లో దాదాపు రూ.14.86లక్షల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు కారకులైన 28 మంది నిరసనకారులను సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించింది. ఆ నష్టాన్ని వారి నుంచే భర్తీ చేసేందుకు నిరసనకారులకు నోటీసులు పంపించింది. వారితో పాటు మేరట్‌లో లైసెన్స్ ఆయుధాలు కలిగి ఉన్న 517 మందికి సైతం నోటీసులు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ నిరసనల్లో పోలీసులు 31 మందిని అరెస్టు చేయగా.. హింసకు కారకులుగా 150 మందిని గుర్తించారు. ఇప్పటికే లఖ్‌నవూలో జరిగిన నిరసనల అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. ప్రభుత్వ ఆస్తి ధ్వంసానికి పాల్పడిన వారి ఆస్తులను వేలం వేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





