News

మట్టి గణపతికే.. జై

211views

పర్యావరణహిత మట్టి గణనాథుడి స్ఫూర్తి ఈ ఏడాది ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఏటా ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ.. మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తూ.. కాలుష్య నివారణకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. ఈ ఏడాది ఎన్టీఆర్‌ జిల్లా ప్రభుత్వం యంత్రాంగమంతా కలిసి.. పర్యావరణహిత గణనాథుడినే పూజిద్దామంటూ ప్రచారం చేస్తోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడానికి.. ఈనెల 26న వినాయక చవితికి ముందురోజు గిన్నిస్‌ రికార్డును సృష్టించేందుకు విజయవాడలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఐదు వేల ప్రతిమలు..
గతంలో 4వేల మందికి పైగా మట్టి గణపతి విగ్రహాలను ఒకేసారి చేసి రికార్డు సృష్టించిన నేపథ్యంలో.. తాజాగా విజయవాడ కేంద్రంగా 5వేల మందితో తయారు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేసింది. నగరంలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో 2వేల మంది ఒకేసారి విగ్రహాలను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడలోని ఐదు విద్యా కేంద్రాల్లో 3వేల మంది విద్యార్థులతోనూ విగ్రహాలను చేయించనున్నారు. వీళ్లందరితో ఒకేసారి విగ్రహాలను తయారు చేయడానికి అవసరమైన శిక్షణను సోమవారం ఇవ్వనున్నారు.

5 టన్నుల మట్టి..
కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దీనికి రూపకల్పన చేశారు. ఇప్పటికే ఐదు టన్నుల బంక మట్టిని తీసుకొచ్చారు. దీనిని ఆరు కేంద్రాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేయబోయే అందరికీ అందించనున్నారు.

ప్రత్యేక యాప్‌ ద్వారా పోటీ..
మట్టి విగ్రహాలను ఈ ఏడాది పూజించే వారికి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఇగ్నైట్‌ పేరుతో యాప్‌ను రూపొందించారు. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసినవాళ్లు ఈ యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తే వాటిలో బాగున్న వాటిని ఎంపిక చేసి ధ్రువపత్రాలు, బహుమతులు ఇస్తారు.

వినూత్నంగా కూరగాయలు, పూలు, విత్తనాలు లాంటి వాటితో విగ్రహాలను తయారు చేసే వారిని ప్రత్యేకంగా ప్రోత్సహించనున్నారు. వేడుకల తర్వాత ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బహుమతుల ప్రదానం చేయనున్నారు.

కాలుష్య నివారణే లక్ష్యం
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్, రంగులతో తయారు చేసే విగ్రహాల్లో ప్రమాదకర రసాయనాలుంటాయి. ఏటా కృష్ణా నది, చెరువుల్లో జలకాలుష్యం జరుగుతోంది. ప్రకృతికి కలిగే నష్టాన్ని నివారించేందుకే పర్యావరణహిత కార్యక్రమానికి రూపకల్పన చేశాం.-లక్ష్మీశ, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌