News

బ్రహ్మోత్సవ ఏర్పాట్లు 90 శాతం పూర్తి

178views

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 16 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు.

రద్దీకి అనుగుణంగా రూ.150, రూ.వంద, ఉచిత దర్శనాలు, ప్రముఖులు వెళ్లేందుకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ప్రధానమైన ఆరు రోజుల్లో రోజుకు 50-60 వేల మంది, మిగిలిన రోజుల్లో 30-40 వేల మంది భక్తులు వస్తారని భావిస్తున్నాం. ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండకుండా ఆర్జిత సేవలు రద్దు చేశాం. ఉదయం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కొనసాగిస్తాం. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలినవి రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయి. 500 మంది సిబ్బందికి అదనంగా వందమందిని తాత్కాలికంగా నియమిస్తాం. క్యూలైన్లలో 14 చోట్ల శుద్ధజలం ఉంటుంది. చిన్నపిల్లలకు పాలు ఇస్తాం. రద్దీ ఎక్కువగా ఉంటే భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తాం. నిత్యం 50 వేల చిన్న లడ్డూలు, 15 వేల పెద్ద లడ్డూలు, 20 వేల వడలు, 30 వేల పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతాం. భక్తులు అడిగినన్ని లడ్డూలు అందిస్తాం.

భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సవాలు తిలకించేలా తిరుమల తరహాలో ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు కడియం నుంచి మొక్కలు తెప్పిస్తున్నాం.నూతన అన్నదాన భవనాన్ని వినాయకచవితి రోజు ప్రారంభిస్తాం. ప్రస్తుతం 2,500 మంది అన్నప్రసాదం తీసుకుంటున్నారు. దాన్ని నాలుగు వేలకు పెంచాం.బృహత్తర ప్రణాళికలో మార్పులు చేసి పనులు ప్రారంభించాం. సీఎం చంద్రబాబు కల అయిన మహా ప్రాకారం నిర్మాణాన్ని రూ.వంద కోట్లతో నిర్మిస్తాం. ఆలయ సమీపంలోని ‘గణేష్‌ సదన్‌’ స్థానంలో క్యూకాంప్లెక్స్‌ నిర్మాణ విషయమై దేవాదాయశాఖకు నివేదిక పంపాం. వినాయకసదన్‌ డిసెంబరులో అందుబాటులోకి తెస్తామని తెలిపారు.