News

2040కల్లా జాబిల్లిపై త్రివర్ణ పతాకం: జితేంద్ర సింగ్

185views

2040లో భారత్‌ సొంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి వికసిత్‌ భారత్‌ ఖ్యాతిని చాటుతారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇందులో భాగంగా 2026లో మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టడానికి భారత్‌ చర్యలు తీసుకుంటుందని.. ‘వ్యోమ్మిత్ర’ అనే రోబోతో ఆ యాత్రను చేపట్టబోతున్నామని వెల్లడించారు. ఆ తర్వాత 2027లో భారత్‌ నేతృత్వంలో తొలి మానవ అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2035కల్లా మనకూ సొంత అంతరిక్ష స్టేషన్‌ ఉంటుందన్నారు. 2040లో భారత వ్యోమగామి చంద్రునిపై సగర్వంగా భారత జెండా ఎగరేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ అంతరిక్ష సంస్కరణలను చేపట్టారన్నారు.

శుక్లాపై చర్చ..ప్రతిపక్షాల వాకౌట్‌
లోక్‌సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భారత వ్యోమగామి శుక్లా గురించి ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్షాలు బిహార్‌ ఓటరు జాబితాలో సవరణలను వ్యతిరేకిస్తూ..నినాదాలు చేశారు. శుక్లాపై ప్రసంగం పూర్తి కాకముందే సభ నుంచి వాకౌట్‌ చేయడం గమనార్హం. ప్రతిపక్షాల తీరును ఎన్డీఏ నేతలు తీవ్రంగా విమర్శించారు. దేశం అభివృద్ధి చెందడం, ముందుకు వెళ్లడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తారని..ఇది ఏమాత్రం అమోదయోగ్యం కాదని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ మాత్రం సోషల్‌ మీడియా వేదికగా శుక్లా ఘనతను ప్రశంసించారు. ఆయన అంతరిక్ష యాత్ర దేశానికి గర్వ కారణమని కొనియాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో(ఐఎస్‌ఎస్‌) ఆయన.. మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను నిర్వహించారన్నారు.