
ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొని, వాటిని అధిగమించి, తిరిగి పురోగమించే స్వభావం, సామర్థ్యం భారత జాతికి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అయితే ఈ లక్షణం పురాతన కాలం నుంచీ వస్తోందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫీనిక్స్ పక్షి లాంటి గుణం భారత్ కి వుందని అభివర్ణించారు.
79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబైలోని రాంభూవు మల్లి ప్రబోధిని క్యాంపస్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ దత్తాత్రేయ హోసబళే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్నారు.
అదే విధంగా అహర్నిశలు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనిక సిబ్బందికి కూడా ధన్యవాదాలు ప్రకటించారు.దేశ సరిహద్దులు చెక్కుచెదరకుండా ఉండటానికి కారణం ధైర్యవంతులు మరియు పరాక్రమవంతులైన సైనికులేనని ప్రకటించారు.
ప్రబోధిని ఉపాధ్యక్షుడు డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే స్వాగతం పలికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రబోధిని కోశాధికారి నీలేష్ గోసావి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాష్ అవడే కూడా పాల్గొన్నారు.





