
కుటుంబ ప్రభోదన్
ముత్యాల్లాంటివి పసిమనసులు. కల్మషం లేని ఆ హృదయాల్లో విలువల బీజాలు పడితే, అవే మహావృక్షాలై ఎదుగుతాయి. రూ.లక్షల్లో ఫీజు కట్టామా, కావాల్సినవన్నీ కాళ్ల ముందుకు తెచ్చామా అన్నది కాదు.. వారిని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు మనం చేయాల్సింది విలువైన సమయం ఇవ్వడం, సద్గుణాల బాటలో నడిపించడమే!
జన్మనిచ్చినవారు సత్యం, ధర్మం, ప్రేమ, సేవ, త్యాగం తమ జీవితాల్లో ఆచరించి చూపితే ఆ సద్గుణాలు పిల్లల్లోనూ అంకురిస్తాయి. స్వామి వివేకానంద ‘నా జీవితాల్లో ఉదాత్తమైన
గుణాలన్నీ నా తల్లిదండ్రుల నుంచి అలవరచుకున్నవే’ అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీ తమ తల్లిదండ్రుల నైతిక ప్రవర్తన, వారు పరిచయం చేసిన ధార్మిక గ్రంథాల ప్రభావం తనపై అమితంగా ఉందని గుర్తుచేసుకున్నారు.
అమ్మఒడి నుంచే…
‘పది మంది ఉపాధ్యాయులు ఒక ఆచార్యునితో సమానం. వందమంది ఆచార్యులు ఒక తండ్రితో సమానం, ఒక తల్లి వెయ్యిమంది తండ్రులతో సమానం!’ అంటోంది మనుస్మృతి. శ్రీరామచంద్రుడి నుంచి శ్రీరామకృష్ణ పరమహంస వరకు సద్గుణాలన్నింటినీ తల్లి నుంచే సంప్రాప్తించుకున్నవారే! ‘కౌసల్య నందన రామా’ అనగానే శ్రీరాముడు పొంగిపోతాడని భక్తుల భావన. సత్యనిష్ఠ, ధార్మిక భావనలు, సరళ జీవనం తన తల్లి పెట్టిన భిక్ష అనేవారు రామకృష్ణ పరమహంస. ఛత్రపతి శివాజీకి తన ఒడిలోనే పాఠాలు నేర్పి మహావీరునిగా తీర్చిదిద్దింది తల్లి జిజియాబాయి. మహాభారతంలో కుంతీదేవి ఆదర్శ మాతృమూర్తి. పాండవులు ధర్మాశ్రయులు కావటానికి, శ్రీకృష్ణ భక్తులై రక్షణ పొందడానికీ ఆ సాధ్వీమణే కారణం. ఎందరో మహర్షులు తమ తండ్రుల జ్ఞాన బోధతో తపోధనులయ్యారు. ఉదాహరణకు పరాశరుని శిక్షణలో వ్యాసుడు, ఆ వ్యాసుడి శిక్షణలో శుకుడు బ్రహ్మజ్ఞానులయ్యారు.
పసితనంలోనే విలువలు
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమబాటలో నడిచేలా చిన్నతనం నుంచే శిక్షణనివ్వాలని మన మహర్షులు సూచించారు. రామాయణ, భారత, భాగవతాల్లోని మహాత్ముల జీవిత గాథల్ని వారికి బోధిస్తూ ఉండాలని హితవు పలికారు. ‘నాలుగేళ్ల వరకు పిల్లల్ని ఆలనగా పాలనగా చూసుకోవాలి. పదహారేళ్ల వయసులో ఉన్నతమైన పౌరులుగా ఎదిగే విద్యను నేర్పాలి’ అని ప్రబోధించారు. ‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అన్నది మనకందరికీ తెలిసిన సామెతే! చిన్నారుల శీలనిర్మాణంలో ప్రధాన పాత్ర కన్నవారిదే. నేటి ఆధునిక సమాజంలో పిల్లల పెంపకానికి తల్లిదండ్రులు కేటాయించగలిగే సమయాన్ని పెంచాలి.
తండ్రి ధైర్యస్థైర్యాలు
దశరథుని పెంపకంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వశాస్త్ర పారంగతులయ్యారు. తండ్రి సత్యధర్మపాలనే కొడుకులకూ సంక్రమించింది. అరణ్యవాసం సందర్భంగా అనసూయాదేవి రాముణ్ని ‘నీకు సీత అంటే ఎందుకంత ప్రేమ?’ అని అడిగింది. అప్పుడు రాముడు ‘నా తండ్రి దశరథ మహారాజు ఎంపిక చేసిన వధువు కాబట్టి’ అన్నాడు. అలాగే కోసల రాజ్య ప్రజలు కూడా నిండుసభలో దశరథ మహారాజు పెంపకంపై అభినందనల జల్లు కురిపించారు. ఎన్ని పనులున్నా, అన్నింటికన్నా మిన్నయిన పని భావిపౌరులను తీర్చిదిద్దడమే. అప్పుడు మనమూ ఉత్తమ తల్లిదండ్రులుగా సార్థకజీవితాన్ని సాధించగలం!





