
జాతీయోద్యమంలో రచయితలు దేశభక్తి తత్పరతతో, స్వాతంత్య్ర సాధనా లక్ష్యంతో అన్ని పక్రియల్లో విరివిగా రచనలు చేశారు. ప్రత్యేకించి నాటక పక్రియ ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించటం సులువని గ్రహించారు.అలా వచ్చిన పౌరాణిక, చారిత్రక, రాజకీయ నాటకాలున్నాయి. వాటిని పరిశీలిద్దాం.
తెలుగు ప్రజలకు ‘పురాణాల పట్ల, పౌరాణిక పాత్రల పట్ల గౌరవాభిమానాలు అధికం. అందువల్ల కొందరు నాటక రచయితలు పౌరాణిక పాత్రల ఆధారంగా భంగ్యంతరంగా జాతీయ భావాలను ప్రబోధించారు. ప్రత్యేకించి 1900 నుంచి 1928 మధ్య కాలంలో పౌరాణిక పద్య నాటకాలు విరివిగా వచ్చాయి.
మంచికీ, ధర్మానికీ విజయం సిద్ధించినట్లు ఉండే సుఖాంత నాటకాలు, భారతీయ సంప్రదాయం ప్రకారం ధర్మానికే జయం కలుగుతుందనే భావాన్ని వ్యక్తపరిచే మహాభారత ఇతివృత్తాలతో నాటకాలు జాతీయోద్యమ కాలంలో విరివిగా వచ్చాయి. అధర్మవర్తనులైన ఆంగ్లేయుల పాలన అంతరించి ధర్మవర్తనులైన భారతీయులకు విజయం కలుగు తుందనే భావం మహాభారత ఇతివృత్తాలతో వచ్చిన నాటకాల్లో ధ్వనిస్తుంది. అందుకే గయోపాఖ్యానం, పాండవోద్యోగం, ద్రౌపదీ వస్త్రాపహరణం, పద్మ వ్యూహం వంటి నాటకాలు బహుళ ప్రజాదరణ పొందాయి. మహాభారత సంబంధమైన పౌరాణిక నాటకాల తీరు గమనార్హం.
భారత జాతీయోద్యమానికి ప్రభావితులైన పప్రథమ తెలుగునాటక రచయిత ధర్మవరం రామకృష్ణమాచార్యులు. ఆయన రచించిన ‘చంద్రహాస’ (1916), పాంచాలీ స్వయంవరం (1918); ప్రమీలార్జునీయం (1920) నాటకాల్లో జాతీయ భావాలు పాఠకులకు స్పష్టంగా కనిపిస్తాయి.
జాతీయోద్యమంలో ‘ఉప్పు’ ప్రముఖ స్థానం వహించింది. గాంధీజీ ఉప్పును ఆధారంగా చేసుకొని 1930లో దండి సత్యాగ్రహాన్ని నిర్వహించారు. అంతకన్నా ముందే ధర్మవరం రామకృష్ణమాచార్యులు 1916లో ‘చంద్రహాస’ నాటకంలో ఉప్పు పన్నును నిరసించారు. చంద్రహాస నాటకానికి ఉప్పుకు సంబంధం లేకున్నా సమకాలీన ప్రభావంవల్ల ఉప్పు అందులో భాగమైంది.
ఆయన రాసిన ‘పాంచాలీ స్వయంవరం’ నాటకానికి విదేశీ వస్తు బహిష్కరణకు సంబంధం లేకున్నా నాటి జాతీయ భావాల ప్రేరణతో ప్రవేశపెట్టి నిరసించారు. ఆయన 1905లో రాసిన ‘ప్రమీలార్జు నీయం’ నాటకంలో స్త్రీ విద్య ప్రాధాన్యాన్ని వివరించారు.
బుద్ధవరపు పట్టాభిరామయ్య 1924లో రాసిన ‘మాతృదాస్య విమోచన నాటకం’ పరోక్షంగా భారతదాస్య విమోచనాన్ని సూచిస్తుంది. ఇవేకాక అప్పటి కొన్ని పౌరాణిక నాటకాల్లో రచయితలు కుల, మత, వర్ణ వ్యవస్థ నిరసన, మహిళల ప్రగతి, మద్య పాన నిరసన, దాస్య విమోచన వంటి జాతీయోద్యమ దోహదాలైన భావాలు ప్రవేశపెట్టారు.
జాతీయోద్యమం – చారిత్రక నాటకాలు
భారతదేశాన్ని ఆంగ్లేయుల కంటే ముందు మహమ్మదీయులు పాలించారు. ఆంగ్లేయుల దుష్పరిపాలనను నేరుగా నిరసించకుండా మహమ్మ దీయ ప్రభువుల పేరుతో పరాయి పాలనను నిరసించి భారతీయుల్లో నూతనోత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ప్రజలు జాతీయోద్యమంలో పాల్గొనేట్లు చేయటంలో చారిత్రక నాటకాలు ఎంతగానో దోహదం చేశాయి. భారత జాతీయోద్యమంలో మహాత్ముడు అడుగుపెట్టగానే, ఆయన ప్రభావంతో ఎన్నో చారిత్రక నాటకాలు వచ్చాయి.
చారిత్రక నాటక రచనా పితామహుడిగా ప్రసిద్ధు డైన కోలాచలం శ్రీనివాసరావు రాసిన ‘రామరాజు చరిత్రము’ చారిత్రక నాటకాల్లో ప్రసిద్ధమైంది. అందులో జాతీయ భావాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. 1919-21 మధ్య కాలంలో వచ్చిన ‘రోషనార’; ‘రసపుత్ర విజయం’ వంటి నాటకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ‘కొండలమెండనుద్ధం డులై చెందాడు దండిమరాటే దండాలుండా… భరతఖండంబు నీకెంత పాటు కలిగే’ వంటి పద్యాలు ప్రసిద్ధమైనవి. ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణ రాసిన దేశభక్తి ప్రేరకమైన ‘రసపుత్ర విజయం’ (1920) నాటకం ఆంగ్లేయుల నిషేధానికి గురి అయింది.
కొప్పరపు సుబ్బారావు రచించిన రోషనార (1921) ‘వర స్వరాజ్యమును సుస్థిరముగా మీరలు, ధరపైన నెలకొల్పదలతురేని’ మొదలైన పద్యాల్లో జాతీయత, దేశభక్తి భావాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి.
జాతీయోద్యమం- రాజకీయ నాటకాలు
దేశభక్తి తత్పరులైన కవులు 1920 తర్వాత భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్య్ర సమరాన్ని ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిపి వారిలో స్వాతంత్య్ర దీప్తిని, స్ఫూర్తినీ కలిగించేందుకు తమ కలాలను ఝళిపించారు. ప్రభుత్వం వారి కుటిల రాజకీయ కుతంత్రాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపడమే లక్ష్యంగా నాటకాలు వచ్చాయి. అటువంటి నాటకాలు రాసిన వారిలో దామరాజు పుండరీ కాక్షుడు అగ్రగణ్యుడు. దామరాజువారు గొప్ప గాంధేయవాది. తన కలం బలంతో తెలుగు రాజకీయ నాటకాలకు శ్రీకారం చుట్టి తెలుగు ప్రజల మన్ననలు పొందారు. జాతీయ నాటక చక్రవర్తిగా ప్రసిద్ధి చెందిన దామరాజువారు జాతీయోద్యమ ప్రచారంలో భాగంగా ‘స్వరాజ్యసోపానము’- అనే నాటకం రచించారు. తిలక్ నిర్యాణానంతరం గాంధీజీ రాజకీయ రంగంలో ప్రవేశించటంతో ప్రారంభమైంది. 1919-20 సంవత్సరాల్లో జరిగిన రాజకీయాలు ఇందులో ప్రతిబింబించాయి.
బహుళ ప్రజాదరణ పొందిన ఈ నాటకాలు నిషేధానికి గురైనాయి. అందువల్ల రచయిత ఈ నాటకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటిది ‘నవయుగారంభము’ లేదా ‘గాంధీ మహోదయం’, రెండోది నవయుగం లేక పాంచాలీ పరాభవం, మూడోది గాంధీ విజయం. ఈ నాటకాల్లో రచయిత బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ, స్వాతంత్య్ర భావోద్ధీపకమైన పద్యాలు రాశారు. ఉదా।। ‘‘రండి స్వరాజ్యరథములాగానవశ్యము రండటంచు’’ అంటూ స్వాతంత్య్రోద్యమంలోకి ఆహ్వానించారు. ప్రజలను పరాభవము పంజాబు దురంతాలను యథాతథంగా చిత్రీకరించిన క్రియాత్మక నాటకం. ఈ నాటకంలో పాటలు, పద్యాలు, సంభాషణలు దేశభక్తి ప్రబోధాలు. ‘గాంధీ నామం మరవరం – మరవం- సిద్ధం- జైలుకు వెళుదాం’ అనే పాట వీరసైనిక గీతాలను తలపింపజేస్తుంది. అలాగే రాట్నంమీద పద్యం అద్భుతమైంది.
‘‘ఈ రాట్నపున్ చక్రమా రామచక్రమై సీమయంత్రాసురు చెండివైచు
ఈ రాట్నపున్ కీ చునా రామ బాణమై ‘పరదేశ
వర్తకాసురుని జంపు….’’
దామరాజు పుండరీకాక్షుడు రచించిన అఖండ భారత్ విజయ విహారంలో
‘‘భరతఖండంబు చక్కని పాడియావు
అక్షయంబుగా క్షీరంబు లందరికిడు
పొట్ట చీల్చిననొక పాలబొట్టనేని
పితకగలమే అఖండ భారతం మనది’’
పై పద్యంలో ‘భరతఖండంబు చక్కని పాడియావు’ ప్రసిద్ధమైన చిలకమర్తి వారి పద్య పాదాల్ని రచయిత యధాతథంగా అనుసరించాడు.
దామరాజు పుండరీకాక్షుడు 1921లో రచించిన ‘నవయుగారంభము’ అను గాంధీ మహోదయము’ బహుళప్రచారం పొందిన రాకీయ నాటకం. ఈ నాటకంలో దేశభక్తుడు, దేశసేవకుల ప్రస్తావన ఆసక్తికరంగా సాగింది. దేశభక్తుడు హిందూ దేశం పూర్వవైభవము కోల్పోయి అధోగతిపాలైన స్థితిని వివరిస్తూ ‘‘రాజాధిరాజులు రమ్యభూమి దాస్యవృత్తికి నిలయమౌధాత్రి అయ్యె’’ అని పలికాడు. భారతీయుల్లో స్వాతంత్య్రేచ్ఛ పెరిగిపోతుందనీ, దాస్యాన్ని భరించే స్థితి దాటిపోయిందని దేశసేవకుడు చెప్పాడు.
దేశభక్తుని మాటల్లో తిలక్‌యుగం పోగానే గాంధీయుగం వచ్చిందని వదంతులు బయలుదేరినట్లు తిలక్ అవతారం చాలించటం గాంధీగారిలో ఆ దైవాంశం ప్రవేశించటం మొదలైన అంశాలు ఇందులో దృశ్యమానం చేశారు.
సోమరాజు రామానుజరావు రచించిన స్వరాజ్యరథము (1921) ఐదు అంకాల పద్య నాటకం. ఇందులో గాంధీజీ రాట్నం అనే సుదర్శన చక్రం కాంతితో మాంచెస్టర్‌ను ఓడించారన్నాడు. భారతమాత లాలా లజపతిరాయ్‌ని ధర్మరాజుగా, షౌకత్ ఆలీని భీమునిగా, చిత్తరంజన్‌దాసుని అర్జునుడిగా, మహమ్మద్ అలీ, సత్యపాల్‌లను నకుల సహదేవులుగా, డయ్యర్‌ను దుశ్శాసనుడిగా పేర్కొన్నారు. పాంచాలిని పరాభవం నుంచి వస్త్రాలు ఇచ్చి కాపాడిన కృష్ణుడిగా గాంధీజీని పోల్చిచెప్పారు. ఈ విధంగా ప్రజల్లో జాతీయోద్యమస్ఫూర్తిని రగిలించారు.
దామరాజు పుండరీకాక్షుడు రచించిన ‘గాంధీ విజయం’ నాటకంలో భరతమాత దేవ దేవ దనుజహర దీననైతి బ్రోవుమా! అని తన చింతదీర్ప శ్రీ మహా విష్ణువుని ప్రార్థించింది. భారతీయుల దైన్యస్థితిని తలపోసుకున్నది. తిలక్, గాంధీ, లాలా లజపతిరాయ్, షౌకతాలి, మహమ్మదాలి మొదలైన వాళ్లు పడుతున్న కష్టాలను స్మరించుకొని తనను రక్షించమని దైవాన్ని ప్రార్థించింది.
శ్రీ కృష్ణుడు ధర్మరక్షణార్థం శిష్టరక్షణకు, దుష్టశిక్షణకు తాను అవతరిస్తానని తన అవతార తత్త్వాన్ని వివరించాడు. కలియుగంలో ధర్మరక్షణార్థం తిలక్‌నై, తరువాత గాంధీగా అవతరిస్తానని చెప్పాడు. అంతేకాక ధర్మరక్షణార్థం రామకృష్ణులుగా, అహింసాతత్త్వానికై బుద్ధునిగా, సౌభ్రాతృత్భవవార్థం ఏసుక్రీస్తుగా, దేవుడొక్కడే అనే భావం కోసం మహమ్మద్‌నై అవతరించిన నేను కలియుగంలో ధర్మరక్షణార్థం తిలక్‌నై, తర్వాత గాంధీగా అవతరిస్తా నని చెపుతాడు. శాంతిమూర్తినై అహింసామార్గాన లోకాలను ఉద్ధరిస్తానని పలికాడు. భరతమాత కళ్లుమూసి తెరవగానే గాంధీ ప్రవేశించటంతో గాంధీకి విజయం కలగాలని ఆశీర్వదిస్తుంది.
‘స్వరాజ్య రథమహోత్సవానికి ముందు జవహర్ దేశసేవకులు జండాలతో నడువగా రథముపై గాంధీ, చిత్తరంజన్‌దాస్, మదనమోహన మాలవ్య, సరోజినీ దేవి, మహమ్మదాలీ సోదరులు మొదలైనవారు రథం వెనుక కదిలారు.జవహరు పాడుతుంటే దేశసేవకులంతా వంతపాడారు. రథముపై త్రివర్ణ పతాకం ఎగురు తుండగా భరతమాతకు జేజేలు కొడుతూ జనవాహిని కదిలింది. ఈ విధంగా గాంధీ విజయం నాటకంలో జాతీయోద్యమ స్ఫూర్తిని, చైతన్యాన్ని ప్రజల్లో కలిగించారు.
విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులను ఆదరించారు. నీచవృత్తులు మాని నాగలి పట్టి పొలాలనుదున్నారు. సురాపానం పాపమని భావించి త్యజించారు. మంచి పాఠశాలలు స్థాపించి లలిత కళలు అభివృద్ధి చేశారు. స్వరాజ్య రథయాత్ర ఈ విధంగా ఆదర్శంగా సాగింది. ఆ సమయంలో చాలామంది రచయితలు జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించే నాటకాలు రాశారు.
శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి కూడా సమకాలిక రాజకీయాంశాలను నాటకీకరించారు. ఆయన ‘గాంధీ విజయధ్వజ నాటకం (1924), ‘తిలక్ మహారాజు’ నాటకం (1929) వంటి నాటకాలు ఆంధ్రదేశ మంతటా ప్రదర్శనలకు నోచుకున్నాయి. ప్రజలను జాతీయోద్యమంవైపు నడిపించాయి. అదే సమయంలో డి.సీతారామయ్యగారి స్వరాజ్యము (1921) జంధ్యాల అయ్యవారి శాస్త్రి, మహమ్మదాలీ ప్రభృతుల నిర్బంధము (1921) పేర్కొనదగిన రాజకీయ నాటకాలు.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆంగ్లేయుల దమననీతి 1919 జలియన్‌వాలా బాగ్ వృత్తాంతంతో భారతీయులకు ఆంగ్లేయుల పట్ల ఏహ్యభావం, నిరసనలు కలిగాయి. సామాజిక చైతన్యం వెల్లి విరిసింది. ఈ ప్రభావంతో తెలుగులో జాతీయోద్యమాన్ని ప్రబోధించే ప్రత్యేక నాటకాలు, రాజకీయ నాటకాలు పుంఖానుపుంఖంగా వచ్చాయి. ఈ నాటకాల్లో ఇతివృత్తాలు 1. సంఘ సంస్కరణ, 2. దేశభక్తి, 3. సమగ్ర జాతీయభావం, 4. మద్యపాన నిషేధం, 5. త్రివిధ బహిష్కరణ (విదేశీ వస్తు బహిష్కరణ, శాసనోల్లంఘన, ఖద్దరు శాస్త్రి), 6. గాంధీజీ సూక్తులు, 7. సత్యాగ్రహం, 8. శాంతి, 9. సౌహార్ద్ర భావం, 10. అస్పృశ్యతానివారణ మొదలైనవి.
జాతీయోద్యమం – సాంఘిక నాటకాలు
సంఘ జీవిత చిత్రణలో సంఘర్షణను సృష్టించ గలిగిన సమస్యలను, సాంఘిక జీవితాన్ని ప్రతిబిం బించే నాటకం సాంఘిక నాటకం. జాతీయోద్యమ ప్రభావంతో అనేక సాంఘిక నాటకాలు వెలువడ్డాయి. జాతీయోద్యమ స్ఫూర్తితో సమకాలీన సమాజంలో ఎప్పుడూ రచయితకు ప్రగతిని దర్శించాలనే ప్రగాఢమైన కాంక్ష ఉంటుంది. ఆనాటి జాతీయోద్యమ భావాలు నాటక రంగం మీద ప్రతీకాత్మక పాత్రల ద్వారా ప్రస్ఫుటమయ్యాయి.
భారతీయులంతా స్వాతంత్య్ర సాధనలో ఉరకలు వేసి ఉత్సాహంతో కొందరు భోగలాలసులై మద్యపానం, వేశ్యా సంపర్కం వంటి వ్యసనాల్లో చిక్కి పతనమవుతుంటే వాటిని నిరోధించి సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించడానికి కొంతమంది నాటక రచయితలు సంఘ సంస్కరణ దృక్పథంతో నాటకాలు రాశారు.
కందుకూరి వీరేశలింగంగారు రచించిన ‘బ్రహ్మ వివాహం’లో బాల్య వివాహాలు, వృద్ధ వివాహాలు, నిరసించారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం, పానుగంటి లక్ష్మీనరసింహారావు, కోలాచలం శ్రీనివాసరావు మొదలైనవారు ‘సంఘంలో దురాచారాలను తూర్పారబట్టారు. గురజాడ అప్పారావు అమేయ శిల్ప ‘కళానైపుణ్యంతో కన్యాశుల్కం’ నాటకం రాసి, ‘కన్యాశుల్కం’ దురాచారంతో ముడివడ్డ బాల్య వివాహాలు, వృద్ధ వివాహాలు వంటి సంఘ దురాచారాలను నిరసించారు. తర్వాత కాలంలో సంఘంలో నెలకొన్న వేశ్యా లంపటత్వం, వరకట్నం, మద్యపానం అనే మూడు దురాచారాలను ఖండిస్తూ మూడు ప్రసిద్ధమైన సాంఘిక నాటకాలు రాసిన ప్రతిభాశాలి కాళ్లకూరి నారాయణరావు. ఆయన రాసిన చింతామణి (1921); వరవిక్రయం, మధుసేవ (1925) ప్రజల్లో సామాజిక స్పృహను పెంపొందించాయి. సంపూర్ణ స్వాతంత్య్ర సిద్ధికి 1947వరకు ఎన్నో నాటకాలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయి. నాటకాల ద్వారా దేశభక్తిని పురికొల్పి జాతీయోద్యమానికి దోహదంచేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు.
వీటి మధ్య చెప్పుకోవలసిన నాటిక చిచ్చుర పిడుగు. దీనిని మద్దూరి అన్నపూర్ణయ్య నడిపిన ‘కాంగ్రెస్’ పత్రికలో ప్రచురించారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో తొలి తూటా పేల్చిన మంగళ్ పాండే పాత్ర కేంద్రంగా నడిచే నాటిక ఇది. అరెరే ఫిరంగీ అంటూ మొత్తం ఇంగ్లీష్ జాతిని తిట్టడానికే దీనిని హనుమంతుని వెంకటప్పయ్య దీనిని రాశారు. కానీ అచ్చులో రచయితగా ఆయన పేరు వేయలేదు. యథా విధిగా ప్రభుత్వం కేసు పెట్టింది. అన్నపూర్ణయ్య ప్రచురణకర్తగా బాధ్యత వహించి జైలుకు వెళ్లారు.
జాతీయోద్యమానికి సమాంతరంగా ఆంధ్రో ద్యమం సాగింది. ఆంధ్రోద్యమ సమస్యపై వెలువడిన మొదటి నాటకం గ్రంధి వెంకటసుబ్బారావు రాసిన ‘ఆంధ్రమాత’. ఇది ఆంధ్రమహాసభ ప్రారంభంలో వచ్చిన నాటకం. ఇందులో రాజకీయ సంబంధిత ‘ఖిలాఫత్’ ఉద్యమాలే కాక వివిధ కేశి ఖండనాది సాంఘిక సమస్యలు కూడా ఇందులో చర్చించ బడ్డాయి. కొర్రపాటి గంగాధరరావు రచించిన ‘కన్నెగంటి హనుమంతు’; గుళ్లపల్లి నారాయణరావు రచించిన ‘ఆంధ్రజ్యోతి’ వంటి నాటకాలు జాతీయోద్యమంలో భాగమైన ఆంధ్య్రోద్యమాన్ని గూర్చి స్పష్టంగా తెలిపాయి.
సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రచించిన ముందడుగు నాటకం (1945) అభ్యుదయ దృక్పథంతో సాగింది. జమీందార్లు రైతులను, కూలీలను అణగద్రొక్క బాధపెడుతుంటే వారందరు ఏకమై జమీందారును ప్రతిఘటించటం ఇందులో ఇతివృత్తం. ‘‘రైతులు, కూలీలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తూ కలిసిమెలిసి నీ హక్కుల కొరకై – కదనముచేయరా!’’ అని ప్రజల్లో జాతీయోద్యమం చైతన్యాన్ని కలిగించారు.
గత భారత చరిత్రలో పురుషుల ఉదాత్త వైఖరులను, దేశభక్తిని కవులు తమ నాటకాల్లో చిత్రించి భారతీయుల్లో నిద్రాణమైన దేశభక్తిని, జాతీయ భావాలను ప్రేరేపించి జాతీయోద్యమానికి తోడ్పడ్డారు. పండిత పామరరంజకమైన నాటక కళ ఉత్తమోత్తమమైంది. నాటక రచయితలు నాటక ప్రదర్శనలతో, తమ కలంబలంతో ప్రజలను చైతన్యవంతులుగా చేశారు. స్వాతంత్య్ర సాధనలో రచయితలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు.





