News

ఏదో ఒకరోజు మళ్లీ అఖండ దేశంగా మారుతుంది : నితిన్ గడ్కరీ

229views

భారత్‌ను సూపర్‌ పవర్‌, విశ్వగురువుగా మార్చాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. ప్రతి రంగంలో మనం బలంగా ఉంటేనే ప్రపంచం భారత్‌ మాట వింటుందన్నారు. నాగ్‌పుర్‌లో రాష్ట్ర నిర్మాణ్‌ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అప్పట్లో అనివార్య పరిస్థితుల్లో దేశ విభజన జరిగిందన్నారు.

‘‘భారత్‌-పాకిస్థాన్‌లు విభజనను గుర్తుచేసుకుంటే.. అనివార్య పరిస్థితుల్లోనే నాడు దేశ విభజన జరిగింది. ఏదో ఒకరోజు మళ్లీ అఖండ దేశంగా మారుతుంది’’ అని గడ్కరీ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భావనతో భారత్‌ దూసుకెళ్తోందన్న ఆయన.. సాయుధ బలగాల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఆత్మనిర్భరత సాధించడంతోపాటు విశ్వగురువుగా భారత్‌ మార్చేందుకు కృషి చేయాలని గడ్కరీ పిలుపునిచ్చారు. ప్రతి రంగంలో భారత్‌ బలంగా ఉంటేనే ప్రపంచం మన మాట వింటుందన్నారు. ఆర్థికంగా, రక్షణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా ఉండటంతోపాటు ప్రతి పౌరుడు దేశభక్తితో ఉన్నప్పుడే ‘విశ్వగురువు’గా మారుతుందన్నారు.